మళ్లీ సెంచరీతో రెచ్చిపోయిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ‘ఏ’ ముందు భారీ టార్గెట్

by Harish |

సౌతాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ మరోసారి అదరగొట్టాడు.

మళ్లీ సెంచరీతో రెచ్చిపోయిన ధ్రువ్ జురెల్..  సౌతాఫ్రికా ‘ఏ’ ముందు భారీ టార్గెట్
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా ‘ఏ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్ మరోసారి అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదిన జురెల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ కొట్టాడు. అతనికి హర్ష్ దూబే, పంత్ కూడా తోడవడంతో మ్యాచ్‌పై భారత ‘ఏ’ జట్టు పట్టు బిగించింది. సౌతాఫ్రికా ‘ఏ’ ముందు 418 పరుగుల భారీ లక్ష్యం పెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 78/3తో శనివారం ఆట కొనసాగించిన భారత్ ‘ఏ’ జట్టు 382/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో మొదట్లో భారత్ ‘ఏ’ తడబాటుకు గురైంది. రెండో రోజే మూడు వికెట్లు కోల్పోగా.. రాహుల్(27), కుల్దీప్(16) కూడా కాసేపు పోరాడి వికెట్లు పారేసుకున్నారు. దీంతో 116 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. క్రీజులోకి వచ్చిన పంత్ కాసేపటికే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

ఈ పరిస్థితుల్లో ధ్రువ్ జురెల్ మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన అతను 170 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు, హర్ష్ దూబే(84) కూడా చెలరేగాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. జురెల్, దూబే రెచ్చిపోవడంతో స్కోరు 300 మార్క్ అందుకుంది. ఈ క్రమంలో దూబె తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దూబె అవుటైన తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన పంత్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు జురెల్, మరోవైపు పంత్ రెచ్చిపోవడంతో స్కోరు పరుగులు పెట్టింది. చూస్తుండగానే స్కోరు 400లకు చేరువైంది. అయితే, పంత్ అవుటవడంతో భారత్ ‘ఏ’ 382/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 34 రన్స్ కలుపుకుని సౌతాఫ్రికా ‘ఏ’ ముందు 417 పరుగుల లక్ష్య నిర్దేశించింది. ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ‘ఏ’ శనివారం ఆట ముగిసే సమయానికి 25/0తో నిలిచింది. ఇంకా ఆ జట్టు 392 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story