టీమిండియాలో ఆ రాష్ట్రాల క్రికెటర్లకే చోటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఊతప్ప

by Harish |

టీమిండియాలో ఆ రాష్ట్రాల క్రికెటర్లకే చోటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఊతప్ప
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ, ముంబై, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రికెటర్లకే ప్రాధాన్యత ఉంటుందని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాడు. ఆ రాష్ట్రాల నుంచి రాకపోతే భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలిపాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడంపై ఊతప్ప తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించాడు. గైక్వాడ్‌ను సెలెక్ట్ చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. గైక్వాడ్ దీన్ని జీర్ణించుకోవడం కష్టమన్నాడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి సానుకూల అంశాలపై దృష్టి పెట్టాలని సూచించాడు. ‘భారత జట్టులో స్థానం కోసం కష్టపడుతూనే ఉండాలి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి రాకపోతే మరింత కష్టపడాలి. మనల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి.’అని ఊతప్ప చెప్పుకొచ్చాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో గైక్వాడ్ సెంచరీ చేసినప్పటికీ అతన్ని పక్కనపెట్టడం పట్ల సెలెక్టర్ల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022లో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన గైక్వాడ్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లే ఆడటం గమనార్హం. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ‌ సహా 228 రన్స్ చేశాడు.


Next Story