ఇంగ్లాండ్‌పై సెంచరీ.. టీ20ల్లోనూ నం.1 ర్యాంక్ దిశగా స్మృతి మంధాన

by Harish |

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన టీ20 ఫార్మాట్‌లోనూ అగ్రస్థానం దిశగా వెళ్తున్నది.

ఇంగ్లాండ్‌పై సెంచరీ.. టీ20ల్లోనూ నం.1 ర్యాంక్ దిశగా స్మృతి మంధాన
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన టీ20 ఫార్మాట్‌లోనూ అగ్రస్థానం దిశగా వెళ్తున్నది. తాజాగా ఆమె మూడో ర్యాంక్‌కు చేరుకుంది. మంగళవారం ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో స్మృతి నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో స్మృతి సూపర్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ పర్ఫామెన్స్‌తోనే ర్యాంక్ మెరుగుపర్చుకోవడంతోపాటు కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్(771) సాధించింది. మంధాన కంటే బెత్ మూనీ(ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్(వెస్టిండీస్) ముందున్నారు. అయితే, అగ్రస్థానంలో ఉన్న మూనీ(794) కంటే మంధాన కేవలం 23 పాయింట్సే వెనుకబడి ఉంది. మిగతా సిరీస్‌లోనూ రాణిస్తే టాప్ ర్యాంక్‌కు వెళ్లడం ఖాయమే. ఓపెనర్ షెఫాలీ వర్మ ఒక్క స్థానాన్ని అధిగమించి 13వ ర్యాంక్‌లో నిలిచింది. తొలి టీ20లో 43 రన్స్‌తో రాణించిన హర్లీన్ డియోల్ 86వ ర్యాంక్ సాధించి తిరిగి ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించింది.

భారత బౌలర్లు దీప్తి, రేణుక సింగ్ తమ ర్యాంక్‌లను కోల్పోయారు. చెరో స్థానం దిగజారి దీప్తి 3వ స్థానంలో, రేణుక 6వ స్థానంలో కొనసాగుతున్నారు. తొలి టీ20లో తెలుగమ్మాయి, స్పిన్నర్ శ్రీచరణి 4 వికెట్లతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం 450వ స్థానంలో ఉన్నది.


Next Story