చాంపియన్స్ ట్రోఫీపై కొనసాగుతున్న సందిగ్ధత.. ఐసీసీ మీటింగ్ మళ్లీ వాయిదా

by Harish |

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై నెలకొన్న సందిగ్ధత కొనసాగుతోంది.

చాంపియన్స్ ట్రోఫీపై కొనసాగుతున్న సందిగ్ధత.. ఐసీసీ మీటింగ్ మళ్లీ వాయిదా
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ‌పై నెలకొన్న సందిగ్ధత కొనసాగుతోంది. ఐసీసీ మీటింగ్ మరోసారి వాయిదా పడింది. గత నెల 29న నిర్వహించిన సమావేశం 20 నిమిషాలకే పోస్ట్‌పోన్ అయిన విషయం తెలిసిందే. గురువారం సమావేశం నిర్వహించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్తగా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షాను పరిచయం చేయడం మీటింగ్ ప్రధాన ఎజెండా. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విషయం కూడా చర్చించదగ్గ అంశాల్లో ఉన్నది. దీంతో చాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు.

కానీ, మీటింగ్ మళ్లీ వాయిదా పడినట్టు జాతీయ మీడియా తెలిపింది. ఈ నెల 7న భేటి జరగనున్నట్టు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడల్‌‌కు అంగీకరించాలని లేదంటే టోర్నీని వేరే దేశానికి తరలిస్తామని ఐసీసీ ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి ఆల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెబుతూనే భారత్‌లో నిర్వహించే ఈవెంట్లలో పాక్ కూడా తటస్థ వేదికగానే ఆడుతుందని మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించినట్టు సమాచారం.

slug : ICC meeting for Champions Trophy 2025 rescheduled to December 7

Next Story