ఈ సారి అడ్డంకులన్నీ బద్దలు కొడతాం : Harmanpreet Kaur

by Harish |   (  Updated:2025-08-11 12:46:09  IST  )

ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.

ఈ సారి అడ్డంకులన్నీ బద్దలు కొడతాం : Harmanpreet Kaur
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభంకానుండగా సోమవారం 50 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌, మిథాలీ రాజ్‌తోపాటు క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ సారి ప్రపంచకప్ గెలుస్తామని దీమా వ్యక్తం చేసింది. వరల్డ్ కప్ నిరీక్షణకు తెరదించడానికి 100 శాతం కష్టపడతామని చెప్పింది.

‘సొంత అభిమానుల ముందు ఆడటం ఎల్లప్పుడు ప్రత్యేకమే. ఈ సారి మేము 100 శాతం ప్రయత్నిస్తాం. భారత అభిమానుల ఎదురుచూస్తున్న ప్రపంచకప్ కోసం అడ్డంకులన్నింటినీ బద్దలుకొడతాం. వరల్డ్ కప్‌లు చాలా స్పెషల్. దేశం కోసం ఏదైనా చేయాలని ఎప్పుడూ ఉంటుంది. యువరాజ్ సింగ్‌ను చూసినప్పుడల్లా నాకు చాలా ప్రేరణగా అనిపిస్తుంది.’అని హర్మన్‌ప్రీత్ తెలిపింది. వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఆడం ఎప్పుడూ సవాల్‌గా ఉంటుందని హర్మన్‌ప్రీత్ తెలిపింది. ‘ఆసిస్‌తో సిరీస్‌తో మేము ఆత్మవిశ్వాసం పొందుతాం. ట్రైనింగ్ క్యాంప్‌లో చాలా కష్టపడుతున్నాం. ఆ ఫలితాన్ని చూస్తారు.’అని పేర్కొంది.

అలాగే, 2017 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై(171 రన్స్) తాను ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను హర్మన్‌ప్రీత్ గుర్తు చేసుకుంది. ‘ఆ ఇన్నింగ్స్ నాకు ఇంకా గుర్తుంది. నాకు చాలా స్పెషల్ ఇన్నింగ్స్ అది. ఆ తర్వాత వ్యక్తిగతంగా నాలో చాలా మార్పు వచ్చింది. ఫైనల్‌లో మేము ఓడిపోయిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని ఉత్సాహపరిచేందుకు చాలా మంది వచ్చారు. అది చాలా ప్రత్యేకమైనది. ’అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది. భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఐసీసీ టైటిల్‌ను గెలవలేకపోయింది. 2005, 2017 వరల్డ్ కప్‌లలో ఫైనల్‌కు చేరగా ఆ రెండు సందర్భాల్లో నిరాశే ఎదురైంది.

Next Story