గిల్ సెంచరీ.. రాణించిన కోహ్లీ

by Ajay Maddhiboyina |

ఆదిల్ రషీద్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ 52(55)) పెవీలియన్ చేరాడు.

గిల్ సెంచరీ.. రాణించిన కోహ్లీ
X

- ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

- ఇండియా 356 ఆలౌట్

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడుతున్న చివరి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. గిల్ సూపర్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఇన్నాళ్లూ ఫామ్ కోసం తంటాలు పడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలకడైన బ్యాటింగ్‌తో రాణించాడు. వీరికి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా తమ ఫామ్‌ను కొనసాగించడంతో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ వేసన ఓవర్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (1)అవుటయ్యాడు. ఆ తర్వాత వైఎస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కలసి నిలకడగా ఆడారు. తొలుత ఆచితూచి ఆడినా.. వీరిద్దరూ క్రమంగా దూకుడు పెంచారు. తన కెరీర్‌లో 50 వన్డే ఆడుతున్న శుభమన్‌ గిల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. గ్రౌండ్‌కు నలుదిక్కులా బంతిని తరలిస్తూ పరుగులు రాబట్టారు. మరో ఎండ్‌లో కోహ్లీ మొదట్లో నెమ్మదిగా ఆడినా.. ఆ తర్వాత తనదైన శైలిని అందిపుచ్చుకున్నాడు. చాన్నాళ్ల తర్వాత వన్డేల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇక కోహ్లీ తన ఫామ్‌ను అందుకోవడంతో తన బ్యాట్ నుంచి అభిమానులు భారీ స్కోర్ ఆశించారు. అయితే ఆదిల్ రషీద్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ 52(55)) పెవీలియన్ చేరాడు. కోహ్లీ, గిల్ కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి గిల్ తన దూకుడును కొనసాగించాడు. బౌండరీలు, సిక్సులతో గిల్ దూకుడుగా ఆడాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. గిల్ దూకుడును మరోసారి ఆదిల్ రషీద్ కట్టడి చేశాడు. 35వ ఓవర్‌లో ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో గిల్ 112(102) ఔటయ్యాడు.

టెయిలెండర్లు వడివడిగా..

శ్రేయస్ దూకుడుగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. అయితే రెండు, మూడు వికెట్లకు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన భారత బ్యాటర్లు.. ఆ తర్వాత చేతులెత్తేశారు. అర్థసెంచరీ చేసిన తర్వాత సెంచరీ వైపు దూసుకొని పోతున్న శ్రేయస్ అయ్యర్ 78(64) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఇక హార్ధిక్ పాండ్యా 17(9), కేఎల్ రాహుల్ 40(29) దూకుడుగా ఆడుతూ తన వికెట్లు పారేసుకున్నారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (13), వాషింగ్టన్ సుందర్ (14), హర్షిత్ రాణా (13), అర్ష్‌దీప్ సింగ్ 2(2), కుద్దీప్ యాదవ్ (1) పరుగులు జోడించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లకు ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2, సాకిబ్ మహ్‌మూద్, గుస్ అట్కిన్సన్, రూట్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు:

ఇండియా : రోహిత్ శర్మ (సి)ఫిల్ సాల్ట్ (బి) మార్క్ వుడ్ 1, శుభ్‌మన్ గిల్ (బి) ఆదిల్ రషీద్ 112, విరాట్ కోహ్లీ (సి) ఫిల్ సాల్ట్ (బి) ఆదిల్ రషీద్ 52, శ్రేయస్ అయ్యర్ (సి) ఫిల్ సాల్ట్ (బి) ఆదిల్ రషీద్ 78, కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) సాకిబ్ మహ్‌మూద్ 40, హార్దిక్ పాండ్యా (బి) ఆదిల్ రషీద్ 17, అక్షర్ పటేల్ (సి) టామ్ బాంటన్ (బి) జో రూట్ 13, వాషింగ్టన్ సుందర్ (సి) హ్యారీ బ్రూక్ (బి) మార్క్ వుడ్ 14, హర్షిత్ రాణా (సి) జాస్ బట్లర్ (బి) గుస్ అట్కిన్సన్ 13, అర్ష్‌దీప్ సింగ్ (రనౌట్) 2, కుల్దీప్ యాదవ్ 1 నాటౌట్; మొత్తం 356 ఆలౌట్ (50 ఓవర్లు)

వికెట్ల పతనం : 6-1, 122-2, 226-3, 255-4, 289-5, 307-6, 333-7, 353-8, 353-9, 356-10

ఇంగ్లాండ్: సాకిబ్ మహ్‌మూద్ (10-0-68-1), మార్క్ వుడ్ (9-1-45-2), గుస్ అట్కిన్సన్ (8-0-74-1), జో రూట్ (5-0-47-1), ఆదిల్ రషీద్ (10-0-64-4), లివింగ్‌స్టన్ (8-0-57-0)

Next Story