సూర్యపై వేటు?.. టీ20 పగ్గాలు కూడా గిల్ చేతికి ఇవ్వాలని గౌతీ ప్లాన్?

by Phanindra |   (  Updated:2025-08-18 00:56:21  IST  )

టీ20 కెప్టెన్‌గా సూర్యపై వేటు వేసి, టీ20 పగ్గాలు కూడా గిల్ చేతికి ఇవ్వాలని గౌతం గంభీర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

సూర్యపై వేటు?.. టీ20 పగ్గాలు కూడా గిల్ చేతికి ఇవ్వాలని గౌతీ ప్లాన్?
X

దిశ, స్పోర్ట్స్: ప్రస్తుతం క్రికెట్ ప్రేమికులంతా ఆసియా కప్, టీమిండియా సెలెక్షన్ గురించే చర్చించుకుంటున్నారు. టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా తన మార్కు చూపించిన శుభ్‌మన్ గిల్‌ను పొట్టి ఫార్మాట్లోకి తీసుకురావాలని, అతన్ని అన్ని ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్‌గా తయారు చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడట గౌతీ. అవేంటో ఒకసారి చూసేద్దామా..?

టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ వచ్చినప్పటి నుంచి అతను గట్టిగా ఫోకస్ పెట్టింది పొట్టి ఫార్మాట్‌పైనే. వచ్చీరాగానే టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్ చేశాడు. కానీ ఇప్పుడు మరోసారి పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌ను మార్చాలని గంభీర్ అనుకుంటున్నాడట. జట్టు మొత్తం టీ20 స్పెషలిస్టులతో నింపేయాలని డిసైడ్ అయ్యాడట. పొట్టి ఫార్మాట్‌కు పనికిరాడనే ఏమాత్రం అనుమానం వచ్చినా.. ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టేస్తూ వచ్చాడు. అలాంటిది ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉండాలని అతను అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

ఓపెనింగ్‌లో మార్పులు..?

గంభీర్ ఆశించిన స్థాయిలో ఆడితేనే జట్టులో చోటు ఉంటుందనే విషయం ప్లేయర్లు అందరికీ అర్థమైంది. అతను చెప్పినట్లే రెచ్చిపోయిన అభిషేక్, సంజూ శాంసన్ ఇద్దరూ ఓపెనర్లుగా సెట్ అయిపోయారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసే రకమే. కానీ ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ కావాలనే ఆలోచనతో వీరిద్దరికీ అన్యాయం చేసేందుకు గంభీర్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. యశస్వి జైస్వాల్, శుభ్‌‌మన్ గిల్ ఇద్దరూ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన నేపథ్యంలో.. ఎవరిని తప్పించి, ఎవరికి జట్టులో చోటిస్తానే అంశం బీసీసీఐలో తలనొప్పులు తెస్తోంది.


సూర్యపై వేటు తప్పదా..?

టీ20 జట్టులో గంభీర్ తీసుకొచ్చిన తొలి మార్పు. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్ చేయడమే. ఎలాంటి పరిస్థితి నుంచైనా జట్టును గెలిపించగలం సూర్య అంటే గంభీర్‌కు చాలా అభిమానం. అందుకే అతనికి సారధ్య బాధ్యతలు అప్పగించాడు. తనలో మంచి కెప్టెన్ ఉన్నాడని సూర్య కూడా నిరూపించుకున్నాడు. కానీ పలువురు మాజీలు, బీసీసీఐ పెద్దలు మాత్రం అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ ఉంటే మంచిదని అంటున్నారట. గంభీర్ కూడా అలా చేస్తే జట్టులో కామన్ కల్చర్‌ వస్తుందని, ఇది టీంకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాడట. దానికోసం ఆసియా కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌పై కెప్టెన్సీ వేటు వేసే అవకాశం ఉన్నదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం శాంసన్, అభిషేక్‌తో ఓపెనింగ్ పటిష్టంగా ఉండటంతో గిల్‌ను తీసుకుంటే ఏ స్థానంలో ఆడించాలనేది కూడా గంభీర్‌కు సవాల్‌గా మారనుంది. అయితే గిల్ కోసం సంజూను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పలువురి అభిప్రాయం.

ఫినిషర్లు వద్దంటున్న గౌతీ..

జట్టులో గంభీర్ తీసుకురావాలని అనుకుంటున్న మరో ప్రధాన మార్పు ఫినిషర్లుగా ఎవరినీ నియమించకపోవడం. టీం మొత్తాన్ని టీ20 స్పెషలిస్టులతో నింపేసి, ఏ స్థానంలో అయినా వారు ఆడేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ అంటున్నాడట. ఉదాహరణకు ఫినిషర్‌గా ఉన్న శివమ్ దూబేను టాపార్డర్‌లో పంపితే.. ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత దూబే తన పవర్ హిట్టింగ్‌ను మరింత ఫలదాయకంగా ఉపయోగించే అవకాశం ఉందని, అంతేకానీ అతన్ని ఫినిషర్‌గా ఉంచడం వల్ల పెద్దగా యూజ్ ఉండదని గంభీర్ వాదన. ‘జట్టులో ఎవరూ ఇది నా స్థానం అనే కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదు. నైపుణ్యాలను బట్టి రోల్స్ ఇవ్వాలి కానీ.. బ్యాటింగ్ స్థానం బట్టి కాదు. మోడర్న్ టీ20 క్రికెటర్ ఏ నెంబర్‌లో అయినా ఆడగలగాలి అనేది గంభీర్ ఆలోచన’ అని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.

Next Story