French Open 2025 : ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక, గాఫ్

by Harish |

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్ ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది.

French Open 2025 : ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక, గాఫ్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఉమెన్స్ సింగిల్ ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. వరల్డ్ నం.1 సబలెంక, అమెరికా స్టార్ క్రీడాకారిణి కోకా గాఫ్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం వీరి మధ్య ఫైనల్ జరగనుంది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్‌‌ను నిలబెట్టుకునే దిశగా సాగిన ఇగా స్వైటెక్(పొలాండ్) పోరాటం ముగిసింది. సబలెంక సెమీస్‌లో ఆమెను మట్టికరిపించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సబలెంక 7-6(7-1), 4-6, 6-0 తేడాతో స్వైటెక్‌ను ఓడించింది. రెండు గంటల 19 నిమిషాలపాటు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. తొలి సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే, చివరికి ఆ సెట్‌ను సబలెంక టై బ్రేకర్‌లో నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఆ తర్వాత బలంగా పుంజుకున్న స్వైటెక్ రెండో సెట్‌ను దక్కించుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‌కు వెళ్లింది. అక్కడ సబలెంకదే పూర్తి హవా. స్వైటెక్ ఒక్క గేమ్ కూడా గెలవలేదు. సబలెంక ఏకపక్షంగా మూడో సెట్‌ను దక్కించుకుని ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పోరు ఆడటం ఆమెకు ఇదే తొలిసారి. మరోవైపు, కోకా గాఫ్ 2022 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడబోతోంది. సెమీస్‌లో ఆమె ఫ్రాన్స్‌ క్రీడాకారిణి లూయిస్ బోయిసన్‌పై 6-1, 6-2 తేడాతో విజయం సాధించింది. గంటకుపైగా సాగిన మ్యాచ్‌లో గాఫ్ అలవోకగా నెగ్గింది. ప్రత్యర్థి నుంచి అసలు పోటీనే ఎదురుకాలేదు.

జకో చరిత్ర

25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్(సెర్బియా)ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లాడు. టోర్నీ చరిత్రలో సెమీస్‌కు చేరిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌లో జకో 4-6, 6-3, 6-2, 6-4 తేడాతో వరల్డ్ నం.3 అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)పై విజయం సాధించాడు. గతేడాది ఫైనల్‌ ఆడిన జ్వెరెవ్ ఈ సారి క్వార్టర్స్‌లో ఇంటిదారిపట్టాడు. 3 గంటల 17 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో జ్వెరెవ్ పోరాడినా జకో దూకుడును అడ్డుకోలేకపోయాడు. తొలి సెట్ నెగ్గి శుభారంభం చేసినప్పటికీ మిగతా మూడు సెట్లను కోల్పోయి మ్యాచ్‌ను జకోకు సమర్పించుకున్నాడు.

Next Story