ఆటకే అందం తెచ్చిన ఆటగాడు మెస్సీ.. ఒళ్లు గగుర్పొడిచే ప్రస్థానం

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-12 14:28:50  IST  )

ఆటకే అందం తెచ్చిన ఆటగాడు మెస్సీ.. ఒళ్లు గగుర్పొడిచే ప్రస్థానం

ఆటకే అందం తెచ్చిన ఆటగాడు మెస్సీ.. ఒళ్లు గగుర్పొడిచే ప్రస్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Lionel Messi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను సాధించిన రికార్డులు చెప్పుకోవడానికే రోజులు పడుతుంది. ఆధునిక ఫుట్‌బాల్‌లో అతనొక ప్రత్యేకమైన క్రీడాకారుడు. అంతర్జాతీయ వేదికల మీదనే కాకుండా.. క్లబ్ మ్యాచులలో కూడా ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

లియోనల్ మెస్సీ పూర్తి పేరు లియోనల్ ఆండ్రస్ మెస్సీ. 24 జూన్ 1987లో అర్జెంటినాలో జన్మించాడు. తండ్రిపేరు జార్జ్ మెస్సీ, తల్లి మారియా. చిన్నప్పటినుంచే మెస్సీ క్రీడలపై ఆసక్తి చూపేవాడు. మెస్సీని ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా తీర్చి దిద్దడంలో అతని అమ్మమ్మ కీలక పాత్ర పోషించింది. మెస్సీ శిక్షణకు, మ్యాచులకు ఆమె తోడుగా వెళ్లడంతో పాటు, డబ్బులు ఇస్తుండేది. మెస్సీకి పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె మరణించింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యాధితో మెస్సీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో చికిత్స దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబమంతా శ్రమించి అతని వైద్యానికి డబ్బులు సమకూర్చేది. దాదాపు చావు అంచుల్లోకి వెళ్లిన మెస్సీకి.. బార్సీలోనాకు చెందిన కోచ్ సాయం చేశాడు. బదులుగా బార్సీలోనా జట్టుకు మెస్సీ ఆడాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. దీనికి మెస్సీతో పాటు కుటుంబం మొత్తం అంగీకరించింది. మెస్సీ కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం స్పెయిన్‌కు షిఫ్ట్ అయింది. 2003లో మెస్సీ తన మొదటి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు.

మెస్సీ ప్రదర్శనకు అవక్కాయిన సెలక్టర్లు.. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడే అవకాశం కల్పించారు. 17 ఆగస్టు 2007న మెస్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మెస్సీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ వెళ్లాడు. రికార్డులు సృష్టించాడు. 2012లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిన్సిస్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంటున్నాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్, ఒలింపిక్ స్వర్ణం, అనేక క్లబ్, వ్యక్తిగత ట్రోఫీలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతన్ని ఫుట్‌బాల్ రారాజుగా క్రీడా లోకం పిలుచుకుంటోంది.

ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న క్రీడాకారుడు హైదరాబాద్‌కు వస్తుండటం, ఇక్కడ ఓ మ్యాచ్ ఆడుతుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మెస్సీతో మ్యాచ్ ఆడాలనుకోవడం మెస్సీ గొప్పతనానికి నిదర్శనం. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఈనెల 13న మ్యాచ్ జరుగనుంది. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ను చూసేందుకు ఫుట్ బాల్ అభిమానులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. మెస్సీ మ్యాచ్ కోసం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Next Story