ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించిన ఇటలీ.. అసాధారణ పోరాటం చేసినా ఓటమే

by Harish |

ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించిన ఇటలీ.. అసాధారణ పోరాటం చేసినా ఓటమే
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జట్టు సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం జరిగిన తమ ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో ఇటలీపై గెలిచి టోర్నీలో ముందడుగు వేసింది. ఇటలీ ఓడినప్పటికీ అసాధారణ పోరాట పటిమ కనబరిచింది. 200లకుపైగా స్కోరు చేసినప్పటికీ ఇంగ్లాండ్ గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. ఈ భారీ స్కోరు చేయడానికి విల్ జాక్సే కారణం. అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మెరుపు ఆట ఆడిన అతను 22 బంతుల్లో 53 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో బాంటన్(30), ఫిలిప్ సాల్ట్(28), బెథెల్(23), సామ్ కర్రన్(25) విలువైన రన్స్ జోడించారు.

ఇక, 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఏ మాత్రం బెదరలేదు. మొదట 22 రన్స్‌కే 3 వికెట్లు పడటంతో ఇటలీ 100‌లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, బెన్ మానెంటి(60) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికితోడు జస్టిన్ మోస్కా(43) కూడా రాణించాడు. దీంతో ఇటలీ 114/3 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. స్వల్ప వ్యవధిలోనే మానెంటి, మోస్కా అవుటైనా.. గ్రాంట్ స్టీవార్ట్(45) భారాన్ని మీదేసుకున్నాడు. అతను కూడా దూకుడుగా ఆడాడు. దీంతో ఆఖరి ఐదు ఓవర్లలో 67 రన్స్ చేయాల్సి రావడంతో ఇంగ్లాండ్‌కు ఇటలీ షాకిస్తుందేమో అనిపించింది. కానీ, సామ్ కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇటలీని నిలువరించాడు. 20 ఓవర్లలో ఇటలీ 178 పరుగులు చేసి ఆలౌటవవడంతో ఇంగ్లాండ్ 24 పరుగుల తేడాతో విజయ తీరాలకు చేరింది. గ్రూపు-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ సూపర్-8కు వెళ్లడంతో స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ ఎలిమినేటర్ అయ్యాయి.


Next Story