IND VS ENG : భారత్ పుంజుకుంటుందా?.. నేటి నుంచే రెండో టెస్టు

by Harish |

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది.

IND VS ENG : భారత్ పుంజుకుంటుందా?.. నేటి నుంచే రెండో టెస్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో గెలిచే అవకాశాలను చేజేతులా కోల్పోయి 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చివరి రోజు ఇంగ్లాండ్‌ను కట్టడి చేయలేక మ్యాచ్‌ను సమర్పించుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ వెనుకబడగా.. ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేటి నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. తొలి టెస్టు పొరపాట్లను సరిదిద్దుకుని రెండో టెస్టులో పుంజుకోవాలని టీమిండియా భావిస్తున్నది. అయితే, ఎడ్జ్‌బస్టన్‌లో పేలవ రికార్డు టెన్షన్ పెడుతున్నది. ఆ స్టేడియంలో ఒక్కసారి కూడా గెలవని భారత్‌కు సవాల్ తప్పదు. మరి, ఈ సారి ఏమైనా అద్భుతం చేస్తుందో చూడాలి. మరోవైపు, తొలి టెస్టు విజయంతో ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నది. ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

తుది జట్టులో భారీ మార్పులు?

తొలి టెస్టులో ఓటమితో భారత్ తుది జట్టులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో తుది జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు? ఎవరిని తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్‌కు తుది జట్టు సెలెక్షన్ సవాల్‌గా మారింది. ప్రధానంగా బుమ్రా రెండో టెస్టు ఆడతాడా?లేదా?అన్నది ఇంకా క్లారిటీ లేదు. చివరి నిమిషంలోనే నిర్ణయం తీసుకుంటామని కెప్టెన్ గిల్ చెప్పాడు. బుమ్రాకు రెస్ట్ ఇస్తే ఆ ప్లేస్ కోసం ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. టెస్టుల్లో ఇంకా అరంగేట్రం చేయనప్పటికీ రెండు వైపుల స్వింగ్ చేసే అర్ష్‌దీప్‌కే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపొచ్చు. తొలి టెస్టులో నిరాశపర్చిన సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇద్దరు స్పిన్నర్లను ఆడేంచే అవకాశాలు ఉన్నట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ తెలిపిన నేపథ్యంలో వీరిలో ఒకరిపై వేటు వేసే చాన్స్ లేకపోలేదు. రవీంద్ర జడేజా‌తోపాటు మరో స్పిన్నర్ కోటా కోసం కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ పోటీపడుతున్నారు. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న సుందర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పేసర్ శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేయనున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే అతని ప్లేస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకోవచ్చు.

తప్పులు సరిదిద్దుకుంటారా?

తొలి టెస్టులో ఓటమి టీమిండియా స్వయంకృతమే. కీలక సమయాల్లో తప్పిదాలే భారత్ ఓటమిని శాసించాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 471, 464 భారీ స్కోర్లే చేసింది. జైశ్వాల్, గిల్, పంత్, రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం టీమిండియా బ్యాటింగ్ బలాన్ని తెలియజేస్తుంది. కానీ, మిడిలార్డర్, లోయర్ వైఫల్యం దెబ్బకొట్టింది. కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ సహా మిగతా వారు విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదుగురు చేసిన పరుగులు 65 మాత్రమే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోగా, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టులో టాపార్డర్‌కుతోడు మిడిల్, లోయర్ ఆర్డర్ తమ పాత్ర నిర్వర్తించాల్సి ఉంది. పేలవ ఫీల్డింగ్ కూడా తొలి టెస్టు ఓటమికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. 7-8 క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అవన్నీ కీలక బ్యాటర్లవే. ఇక, 371 పరుగుల భారీ లక్ష్యాన్ని బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఒక దశలో స్వల్ప వ్యవధిలోనే నాలుగు వికెట్లు పడగొట్టి పోటీలోకి వచ్చే చాన్స్ వచ్చినా అందిపుచ్చుకోలేకపోయారు. రెండో టెస్టులో భారత్ ఈ పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరో ఓటమి తప్పదు.

ఎడ్జ్‌బస్టన్‌లో పేలవ రికార్డు

రెండో టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బస్టన్ స్టేడియం టీమిండియాకు ఇప్పటివరకు అచ్చిరాలేదు. ఈ స్టేడియం భారత్ పేలవ రికార్డును కలిగి ఉంది. ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటివరకు 8 టెస్టులు ఆడగా.. అందులో ఏడింట ఓడగా మరోటి డ్రా చేసుకుంది. 2022లో జరిగిన చివరి టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌‌లో 132 పరుగుల ఆధిక్యంలో నిలిచిన భారత్ అనూహ్యంగా పరాజయం పాలైంది. మరి, ఇప్పటివరకు అచ్చిరాని స్టేడియంలో భారత్ ఈ సారి ఏమైనా అద్భుతం చేస్తుందో చూడాలి.

Next Story