ఫైనల్‌లో భారత్ బోల్తా.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

by Harish |

ఫైనల్‌లో భారత్ బోల్తా.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ. ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్‌ ఫైనల్‌లో భారత జట్టు బోల్తాపడింది. హైదరాబాద్‌లో శనివారం ఇంగ్లాండ్‌తో జరిగిన పోరులో 2-0తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. అయితే, టోర్నీలో భారత జట్టు అడుగుపెట్టిన లక్ష్యం ఇప్పటికే నెరవేరింది. ఫైనల్‌కు చేరుకోవడంతోనే ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. కానీ క్వాలిఫయర్స్‌లో కూడా విజేతగా నిలిచి ఉంటే ఆ ఆనందం రెట్టింపు అయ్యేది.

టోర్నీ ఆరంభం నుంచి సత్తాచాటిన భారత జట్టు ఫైనల్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మొదట్లో భారత్ దూకుడుగానే మ్యాచ్‌ను ఆరంభించింది. అలాగే, చక్కటి డిఫెన్స్ కూడా ప్రదర్శించింది. ఇంగ్లాండ్ ప్లేయర్ల వ్యూహాలను తిప్పికొట్టింది. అదే సమయంలో గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. నాలుగు పెనాల్టీ కార్నర్‌లను మిస్ చేసుకుంది. మరోవైపు, 13వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ కార్నర్ దక్కగా బాల్సన్ గ్రేస్ దాన్ని గోల్‌గా మలిచి జట్టుకు శుభారంభం అందించింది. అలాగే, 43వ నిమిషంలో నీల్ ఎలిజబిత్ చేసిన గోల్‌తో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత్ ఒక్క గోల్ కూడా చేయకుండానే ఓటమిని అంగీకరించింది.


Next Story