- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FIFA World cup : ఫిఫా ప్రపంచకప్‌లో పెను సంచలనం.. నాలుగుసార్లు చాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ షాక్
ఫిఫా వరల్డ్ కప్‌లో పెను సంచలనం నమోదైంది.

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఈక్వెడార్ జట్టు ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ అయిన జర్మనీకి షాకిచ్చింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో ఈక్వెడార్ 2-1తో విజయం సాధించింది. ఇప్పటికే రెండు విజయాలతో దూకుడు మీద ఉన్న జర్మనీకి ఈక్వెడార్‌పై కూడా గెలుపు నల్లేరు మీద నడకే అనిపించింది. అందుకు తగినట్టుగానే ఆ జట్టు ప్లేయర్ లెరోయ్ సనె 2వ నిమిషంలోనే గోల్ చేశాడు. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు లేదు. కాసేపటికే ఈక్వెడార్ స్కోరును సమం చేసింది. 9వ నిమిషంలో నెల్సన్ అంగులో అద్భుతమైన గోల్ అందించి జట్టును పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక చాలా సేపు ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. ఇరు జట్లు గోల్ కోసం చేసినా ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఈక్వెడారే మళ్లీ గోల్ కొట్టి జర్మనీకి షాకిచ్చింది. 77వ నిమిషంలో గొంజాలో ప్లేటా చేసిన గోల్‌తో ఆ జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మిగతా సమయంలో జర్మనీ మరో గోల్ చేయకపోవడంతో ఈక్వెడార్ విజయం సాధించింది. బంతి ఎక్కువగా జర్మనీ ఆధీనంలోనే ఉన్నప్పటికీ ఆ జట్టు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. జర్మనీ 11 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా.. ఈక్వెడార్ 8సార్లు ట్రై చేసింది. ఇరు జట్లు చెరో మూడు సార్లు గోల్ పోస్టుపై దాడి చేశాయి. ఈక్వెడార్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి జర్మనీకి చెక్ పెట్టింది.
20 ఏళ్ల తర్వాత..
జర్మనీపై సంచలన విజయం సాధించిన ఈక్వెడార్ ప్రపంచకప్‌లో నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించింది. 20 ఏళ్ల తర్వాత ఆ జట్టు నాకౌట్‌కు చేరుకుంది. చివరిసారిగా 2006లో నాకౌట్‌లో పాల్గొంది. జర్మనీపై గెలుపుతో ఆ జట్టు ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈక్వెడార్‌కు ఇది కచ్చితంగా గొప్ప విజయాల్లో ఒక్కటిగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ఈక్వెడార్ ప్రెసిడెంట్ డేనియల్ నోబోవా శుక్రవారాన్ని నేషనల్ హాలిడేగా ప్రకటించారు. ‘విమర్శలు, అవమానాలు, కఠిన క్షణాలు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి కోలుకుని యావత్ దేశానికి ఈ ఆనందాన్ని అందించిన ప్లేయర్లకు, కోచ్‌కు ధన్యవాదాలు’అని నోబోవా ఎక్స్ వేదికగా ప్రశంసించారు. గ్రూపు-ఈ నుంచి జర్మనీ, ఐవోరీ కోస్ట్, ఈక్వెడార్ తర్వాతి రౌండ్‌కు వెళ్లాయి.






