ఆ కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయండి.. బీసీసీఐకి సూచించిన ఇర్ఫాన్ పఠాన్

by Harish |

ఆ కుర్రాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయండి.. బీసీసీఐకి సూచించిన ఇర్ఫాన్ పఠాన్
X

దిశ, స్పోర్ట్స్ : యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐకి సూచించాడు. ఇక అతని విషయంలో ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లోనూ అదరగొడుతున్నాడు. సీఎస్కేపై 17 బంతుల్లో 52 రన్స్ చేసిన అతను మంగళవారం ముంబైపై 14 బంతుల్లో 39 రన్స్ చేశాడు. బుమ్రా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ బౌలింగ్‌లోనూ వైభవ్ ఇబ్బందిపడలేదు. పైగా తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఆశ్చర్యపరిచాడు.

ఈ నేపథ్యంలోనే వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేసే విషయంలో ఆలస్యం చేయుద్దని బీసీసీఐకి పఠాన్ సూచించాడు. ‘‘బుమ్రా కోసం నేను ఎదురుచూస్తున్నా. గతేడాది అతని బౌలింగ్‌లో అవుటయ్యా. ఈ సారి మాత్రం అతన్ని బౌలింగ్‌లో కొడతా’అని వైభవ్ చెప్పాడు. చెప్పినట్టే బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతిని సిక్స్ కొట్టి చూపించాడు. వైభవ్ ఆడిన తీరు బుమ్రాను ఆలోచించేలా చేసింది. ’అని పఠాన్ చెప్పాడు. అలాగే, వైభవ్ ఫియర్‌లెస్ మైండ్‌సెట్ గురించి మాట్లాడుతూ..‘ఎవరు బౌలింగ్ చేస్తున్నారు? వారి యాక్షన్ ఏంటి? అని వైభవ్ పెద్దగా ఆలోచించడు. బంతిని మాత్రమే చూస్తాడు. బాల్ కొట్టే విధంగా ఉంటే కొట్టేస్తాడు. అదే అతనిలోని ప్రత్యేకత. ఈ కుర్రాడిని చాలా కాలం వెయిట్ చేయించొద్దు. జాతీయ జట్టులోకి తీసుకోండి. ఇప్పుడే తీసుకుంటే 20 ఏళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడతాడు.’అని పఠాన్ చెప్పుకొచ్చాడు.


Next Story