ఆడగలడు.. కానీ అలసిపోయాడు.. కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్‌పై డీకే

by Phanindra |

కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్‌పై దినేష్ కార్తీక్ స్పందించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ మళ్లీ ఆడాలనే డిమాండ్లకు సమాధానం ఇచ్చాడు.

ఆడగలడు.. కానీ అలసిపోయాడు.. కోహ్లీ టెస్టు రిటైర్‌మెంట్‌పై డీకే
X

దిశ, స్పోర్ట్స్: టెస్టుల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న విరాట్ కోహ్లీ తిరిగి సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడాలని, రిటైర్‌మెంట్ వాపస్ తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై తాజాగా దినేష్ కార్తీక్ స్పందించాడు. టెస్టుల్లో కోహ్లీ తనను తాను చాలా బలంగా పుష్ చేసుకున్నాడని, దీంతో అతని శరీరం ఇంకా ఆడే స్థాయిలోనే ఉన్నప్పటికీ, మనసు మాత్రం అలసిపోయిందని డీకే అభిప్రాయపడ్డాడు. ఇంకా ఆడే సామర్థ్యం ఉన్నా మానసికంగా విశ్రాంతి కావాలనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని అతను వివరించాడు.

ఊసరవెల్లిగా మార్చాడు..

ఇదే సమయంలో టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోనీ గురించి కూడా డీకే సరదా కామెంట్స్ చేశాడు. ధోనీ వల్ల తాను ఊసరవెల్లిలా మారాల్సి వచ్చిందన్నాడు. ధోనీ కన్నా మూడు నెలల ముందే టీమిండియా అరంగేట్రం చేసిన డీకే.. మహీ రాకతో జట్టులో చోటు కోల్పోయాడు. పవర్ హిట్టింగ్‌తో జట్టులో ధోనీ స్థిరపడటంతో.. రీఎంట్రీ కోసం తాను రకరకాల ప్రయోగాలు చేశానన్నాడు. ‘ధోనీ ఉండటంతో.. నేను ఏం చెయ్యగలనని ప్రశ్నించుకునేవాడిని. టీంలో ఓపెనర్ కోసం చూస్తున్నారని తెలిస్తే.. తమిళనాడు వెళ్లి ఓపెనింగ్ చేస్తానని అడిగేవాడిని. మిడిలార్డర్‌లో ఖాళీ ఉంటే అక్కడే ఆడేవాడిని. అలా అన్నీ చేసి, నన్ను నేనో ఊసరవెల్లిలా మార్చుకున్నా. కానీ దక్కిన స్థానాన్ని నిలుపుకోలేకపోయా. నా మీద నేను పెట్టుకున్న ఒత్తిడి వల్ల ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా’ అని చెప్పుకొచ్చాడు.

Next Story