దీప్తి ఆల్‌రౌండ్ షో.. విజయంతో వరల్డ్ కప్ షురూ..!

by Phanindra |

దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో భారత జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌ను విజయంతో ప్రారంభించింది.

దీప్తి ఆల్‌రౌండ్ షో.. విజయంతో వరల్డ్ కప్ షురూ..!
X

దిశ, స్పోర్ట్స్: మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచులో భారత జట్టు తడబడి నిలబడింది. బ్యాటింగ్‌లో మంధాన, హర్మన్‌ప్రీత్ వంటి స్టార్లు తడబడగా.. లోయర్ ఆర్డర్ ప్లేయర్లు దీప్తి శర్మ, అమన్‌జోత్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. హర్లీన్ డియోల్ కూడా అద్భుతంగా పోరాడింది. చివర్లో స్నేహ్ రాణా మెరుపులతో శ్రీలంక ముందు 271 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేజింగ్‌లో లంక బ్యాటర్లను భారత స్పిన్నర్లు చుట్టేశారు. బ్యాటుతోపాటు బంతితోనూ చెలరేగిన దీప్తి మూడు వికెట్లతో మెరిసింది. ఆమెకు రాణా, శ్రీచరణి చక్కటి సహకారం అందించడంతో లంకేయులు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఆ జట్టును 45.4 ఓవర్లలోనే ఆలౌట్ చేసిన భారత్.. 59 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్ కప్‌ను అద్భుతంగా మొదలు పెట్టింది.

వన్డే వరల్డ్ కప్‌ను భారత అమ్మాయిలు విజయంతో ఆరంభించారు. తొలి మ్యాచులోనే అద్భుతమైన పోరాటపటిమ కనబరిచారు. గువాహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (8) నాలుగో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. ఆ తర్వాత ప్రతీకా రావల్ (37), హర్లీన్ డియోల్ (48) ఇద్దరూ ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఇలాంటి సమయంలో వర్షం పడి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో ఆటను 47 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. వర్షం ఆగిన తర్వాత ఆట మొదలైన కాసేపటికే ప్రతీక అవుటైంది.

ఒకే ఓవర్లో ముగ్గురు అవుట్

హర్లీన్‌కు జత కలిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (21) కాసేపు ఆకట్టుకున్నా.. వీరిద్దరి భాగస్వామ్యం కూడా ఎక్కువ సేపు కొనసాగలేదు. శ్రీలంక బౌలర్ రణవీర వేసిన 26వ ఓవర్లో హర్లీన్, హర్మన్‌ప్రీత్‌తోపాటు జెమీమా రోడ్రిగెజ్ (0) కూడా పెవిలియన్ చేరారు. దీంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అవడం ఖాయమని అంతా అనుకున్నారు. రిచా ఘోష్ (2) కూడా నిరాశ పరిచింది. ఇలాంటి సమయంలో జతకలిసిన దీప్తి శర్మ (53), అమన్‌జోత్ కౌర్ (57) ఇద్దరూ అదరగొట్టారు. చెరో హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు. చివర్లో స్నేహ్ రాణా (28 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల స్కోరు చేసింది.

శ్రీలంక తడబాటు

ఛేజింగ్‌లో శ్రీలంక బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. ఓపెనర్ హాసిని పెరీరా (14) విఫలమైంది. అయితే కెప్టెన్ ఆటపట్టు (43), హర్షిత (29) ఆ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆటపట్టు అవుటైన తర్వాత ఏ దశలోనూ ఆ టీం కోలుకోలేదు. మధ్యలో నీలాక్షిత సిల్వ (35) పోరాడే ప్రయత్నం చేసినా.. ఆమెకు ఎవరి నుంచీ సహకారం లభించలేదు. మొత్తం టీంలో ఆటపట్టు, నీలాక్షిత, హర్షిత మాత్రమే 20 పరుగుల మార్కు దాటారు. మిగతా వాళ్లంతా ఆ మాత్రం స్కోరు కూడా చేయలేకపోయారు.

చెలరేగిన భారత బౌలర్లు

లంక బ్యాటర్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విజయం సాధించారు. బంతి అందుకున్న ప్రతి బౌలర్ వికెట్ తీసుకోవడం గమనార్హం. వారు క్రీజులో కుదురుకుంటున్న ప్రతిసారీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి అద్భుతంగా రాణించారు. దీప్తి మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. రాణా, చరణి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, ప్రతీకా రావల్ కూడా తలో వికెట్‌తో రాణించారు. దీంతో శ్రీలంక జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ ఏకంగా 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటుతోపాటు బంతితోనూ రాణించిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

మ్యాచ్ చూసిన అఫ్గాన్ మహిళా టీం..

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరణార్థులుగా మారిన ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు కూడా ఈ వరల్డ్ కప్ గేమ్‌ చూసేందుకు వచ్చింది. తాలిబన్ సర్కారులో మహిళలకు హక్కులుండని కారణంగా ఆ దేశం వదిలి పారిపోయిందీ జట్టు. వీళ్లంతా గువాహతి వస్తున్న విషయాన్ని కూడా ఐసీసీ రహస్యంగానే ఉంచింది.

స్కోరు బోర్డు

భారత ఇన్నింగ్స్: 269/8 (47 ఓవర్లు)

ప్రతీకా రావల్ (సి)గుణరత్నే(బి)రణవీర 37, స్మృతి మంధాన (సి)గుణరత్నే(బి)ప్రబోధని 8, హర్లీన్ డియోల్ (సి)దిల్హారి(బి)రణవీర 48, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి)సంజీవని(బి)రణవీర 21, జెమీమా రోడ్రిగెజ్ (బి)రణవీర 0, దీప్తి శర్మ (సి)కుమారి(బి)కులసూరియ 53, రిచా ఘోష్ (సి)ప్రబోధని(బి)ఆటపట్టు 2, అమన్‌జోత్ కౌర్ (సి)గుణరత్నే(బి)ప్రబోధని 57, స్నేహ్ రాణా 28 నాటౌట్, ఎక్స్‌ట్రాలు: 15

బౌలింగ్: అచినా కులసూరియ (8-0-42-1), ఉదేశిక ప్రబోధని (10-1-55-2), సుగంధిక కుమారి (9-0-46-0), కవిషా దిల్హారి (8-0-51-0), ఇనోక రణవీర (9-0-46-4), చమరి ఆటపట్టు (3-0-24-1)

శ్రీలంక ఇన్నింగ్స్: 211 ఆలౌట్ (45.4 ఓవర్లలో)

హాసిని పెరీరా (బి)గౌడ్ 14, ఆటపట్టు (బి)శర్మ 43, హర్షిత సమరవిక్రమ (ఎల్బీడబ్ల్యూ)శ్రీచరణి 29, విష్మి గుణరత్నే (ఎల్బీడబ్ల్యూ)ఏబీ కౌర్ 11, కవిషా దిల్హారి (సి)ఘోష్(బి)శర్మ 15, నిలాక్షిత సిల్వా (బి)రాణా 35, అనుష్క సంజీవని (సి)హర్మన్‌ప్రీత్(బి)శర్మ 6, సుగంధిక కుమారి (బి)రాణా 10, అచినా కులసూరియ(సి)మంధాన(బి)శ్రీచరణి 17, ఉదేశిక ప్రబోధని 14 నాటౌట్, రణవీర (ఎల్బీడబ్ల్యూ)ప్రతీకా రావల్ 3, ఎక్స్‌ట్రాలు: 14

బౌలింగ్: క్రాంతి గౌడ్ (9-0-41-1), అమన్‌జోత్ కౌర్ (6-0-37-1), స్నేహ్ రాణా (10-0-32-2), దీప్తి శర్మ (10-1-54-3), శ్రీచరణి (8-0-37-2), ప్రతీకా రావల్ (2.4-0-6-1)

Next Story