రెండో రౌండ్‌లోనే సింధు ఔట్.. యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా సంచలన విజయం

by Harish |

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

రెండో రౌండ్‌లోనే సింధు ఔట్..  యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా సంచలన విజయం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌లోనే ఆమె ఇంటిదారిపట్టింది. మరో భారత యువ షట్లర్ ఉన్నతి హుడా చేతిలో ఆమె చిత్తయ్యింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సింధుపై 16-21, 21-19, 13-21 తేడాతో హుడా విజయం సాధించింది. గెలుపు కోసం ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. గంటా 13 నిమిషాలపాటు మ్యాచ్ సాగింది. తొలి గేము హుడా నెగ్గగా..రెండో గేము సింధు కైవసం చేసుకుంది. చెరో గేమ్ గెలవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేముకు వెళ్లింది. అక్కడ హుడా అద్భుత ప్రదర్శన చేసి సింధును నిలువరించి విజేతగా నిలిచింది. దీంతో హుడా క్వార్టర్స్‌కు చేరుకోగా.. సింధు నిష్ర్కమించింది. క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచితో హుడా తలపడనుంది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణయ్ ఇంటిదారిపట్టాడు. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీ షట్లర్ చౌ టియెన్ చెన్ 18-21, 21-15, 21-8 తేడాతో ప్రణయ్‌ను ఓడించాడు. తొలి గేము నెగ్గి శుభారంభం చేసిన ప్రణయ్ ఆ తర్వాత పలు తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.

క్వార్టర్స్‌కు సాత్విక్ జోడీ

పురుషుల డబుల్స‌లో సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-19, 21-19 తేడాతో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కర్నాండో-బగాస్ మౌలానా జంటపై గెలుపొందింది. 43 నిమిషాలపాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థులు తీవ్ర పోటీనిచ్చినప్పటికీ సాత్విక్ జంట మాత్రం వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థి జంట తప్పిదాలను సద్వినియోగం చేసుకుని వరుసగా రెండు గేముల్లోనే మ్యాచ్‌‌ను సొంతం చేసుకుంది.


Next Story