వరల్డ్ నం.6కు షాక్ ఇచ్చిన సింధు.. చైనా ఓపెన్‌లో శుభారంభం

by Harish |

చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది.

వరల్డ్ నం.6కు షాక్ ఇచ్చిన సింధు.. చైనా ఓపెన్‌లో శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 21-15, 8-21, 21-17 తేడాతో వరల్డ్ నం.6, జపాన్ షట్లర్ టోమోకా మియాజాకికి షాకిచ్చింది. గంటకుపైగా నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సింధు పోరాడి గెలిచింది. తొలి గేమ్ నెగ్గి మ్యాచ్‌‌‌ను ఘనంగానే ఆరంభించింది. అయితే, రెండో గేములో ప్రత్యర్థి దూకుడు ముందు తేలిపోయింది. ఆ తర్వాత బలంగా పుంజుకున్న సింధు ప్రత్యర్థిని కట్టడి చేసింది. నిర్ణయాత్మక మూడో గేములో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది.

యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో ఉన్నతి 21-11, 21-16 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మౌర్‌పై విజయం సాధించింది. 36 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఉన్నతి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అలవోకగా నెగ్గింది. అయితే, రెండో రౌండ్‌లో సింధు, ఉన్నతి ఎదురుపడటంతో ఇద్దరిలో ఒక్కరే తర్వాతి రౌండ్‌కు చేరుకోనున్నారు. ఇక, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌‌లో సాత్విక్ జోడీ 21-13, 21-9 తేడాతో జపాన్‌కు చెందిన హిరోకి ఒకమురా-కెన్యా మిత్సుహాషి ద్వయంపై గెలుపొందింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన భారత జంట కేవలం 31 నిమిషాల్లోనే మ్యాచ్ సొంతం చేసుకుని రెండో రౌండ్‌‌కు చేరుకుంది.


Next Story