China Open : సాత్విక్ జోడీ మళ్లీ సెమీస్‌లోనే బోల్తా

by Harish |

భారత పురుషుల స్టార్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి‌లకు నిరాశ.

China Open : సాత్విక్ జోడీ మళ్లీ సెమీస్‌లోనే బోల్తా
X

దిశ, స్పోర్ట్స్ : భారత పురుషుల స్టార్ డబుల్స్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి‌లకు నిరాశ. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ మాజీ వరల్డ్ నం.1 జోడీ మళ్లీ సెమీస్‌లోనే బోల్తాపడింది. శనివారం జరిగిన సెమీస్‌లో సాత్విక్ జంట 13-21, 17-21 తేడాతో మలేసియాకు చెందిన ఆరోచ్ చియా-సోహ్ వూయ్ యిక్ జోడీ చేతిలో ఓడిపోయింది. 42 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్‌లు విజయం కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. తొలి గేము ఆరంభంలో 4-1తో ఆధిక్యంలో నిలువగా ఆ లీడ్‌ను కాపాడుకోలేకపోయారు. ఇక, రెండో గేములో ప్రత్యర్థులకు గట్టిపోటీనిచ్చారు. ఒక దశలో 7-12తో వెనుకబడిన స్థితి నుంచి 16-16తో స్కోరును సమం చేసి పోటీలోకి వచ్చారు. కానీ, ఆ తర్వాత మలేసియా షట్లర్ల దూకుడును నిలువరించలేకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది భారత జంట సెమీస్‌లో ఓడటం ఇదే మూడోసారి. ఇంతకుముందు సింగపూర్ ఓపెన, ఇండియా ఓపెన్‌లలో సెమీస్‌లోనే బోల్తా పడ్డారు. సాత్విక్ జోడీ నిష్ర్కమణతో చైనా ఓపెన్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం కూడా ముగిసింది. సింగిల్స్ ప్లేయర్లు సింధు, హెచ్.ఎస్ ప్రణయ్‌లు ఇప్పటికే పరాజయం పాలైన విషయం తెలిసిందే.


Next Story