అల్కరాజ్‌దే సిన్సినాటి ఓపెన్.. మహిళల టైటిల్ నెగ్గిన స్వియటెక్

by Phanindra |

సిన్సినాటి ఓపెన్ టైటిల్‌ను అల్కరాజ్‌ గెలుచుకున్నాడు. సిన్నర్ అనారోగ్యంతో తప్పుకోవడంతో టైటిల్ అల్కరాజ్‌కు దక్కింది. మహిళల టైటిల్‌ను స్వియటెక్ సాధించింది.

అల్కరాజ్‌దే సిన్సినాటి ఓపెన్.. మహిళల టైటిల్ నెగ్గిన స్వియటెక్
X

దిశ, స్పోర్ట్స్: స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ నెంబర్ వన్ జానిక్ సిన్నర్‌తో జరిగిన సిన్సినాటి ఓపెన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో అతను నెగ్గాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సిన్నర్.. 30-డిగ్రీల ఎండలో ఆడలేకపోయాడు. తొలి గేమ్‌లో 5-0తో వెనుక బడిన అనంతరం తను ఆడలేనని ప్రకటించి, రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. దీంతో అల్కరాజ్‌కు ఈ టైటిల్ దక్కింది. ఫ్యాన్స్ కోసమే ఆడేందుకు వచ్చానని, కానీ తన వల్ల కాలేదని సిన్నర్ అన్నాడు. తను చాలా డిసప్పాయింట్ అయినప్పటికీ అల్కరాజ్ అద్భుతమైన ప్లేయర్ అని, మంచి ఫామ్‌లో ఉన్నాడని కొనియాడాడు. యూఎస్ ఓపెన్‌ మొదలయ్య సమయానికి కోలుకుంటానని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

యూఎస్ ఓపెన్ నుంచి అవుట్!

అనారోగ్యంతో బాధపడుతున్న సిన్నర్.. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీ నుంచి తప్పుకున్నాడు. సిన్నర్-కాటెరినా సినియకొవా జోడీని టోర్నీ నుంచి తప్పించినట్లు యూఎస్ ఓపెన్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలో అతను సింగిల్స్ విభాగంలో అయినా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటాడా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

మహిళల్లో స్వియటెక్..

ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ మూడో ర్యాంక్ ఇగా స్వియటెక్ తన ఖాతాలో వేసుకుంది. సెమీస్‌లో ఎలెనా రైబకినాపై నెగ్గి ఫైనల్‌లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో ఇటాలియన్ జాస్మిన్ పాలినీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంది. అయితే 7-5, 6-4 తేడాతో తొలి రెండు గేమ్స్ నెగ్గి సిన్సినాటి ఓపెన్‌లో తొలిసారి విజేతగా నిలిచింది. 2023, 2024లో కూడా ఈ టోర్నీలో స్వియటెక్ రాణించింది. కానీ సెమీస్‌లో ఓడి ఇంటిమొఖం పట్టింది. ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్తగా ఆడిన ఆమె.. ట్రోఫీ ముద్దాడింది.

Next Story