ఆస్ట్రేలియన్ ఓపెన్‌ చాంపియన్‌గా అల్కరాజ్.. ఫైనల్‌లో జకో చిత్తు

by Harish |

ఆస్ట్రేలియన్ ఓపెన్‌ చాంపియన్‌గా అల్కరాజ్.. ఫైనల్‌లో జకో చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ :స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ఎట్టకేలకు సాధించాడు. తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో అదిరే ప్రదర్శన చేసిన అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ నయా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్‌లో దిగ్గజ ప్లేయర్ నోవాక్‌ జకోకు షాకిచ్చాడు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన అతను తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి కెరీర్ గ్రాండ్‌స్లామ్ కలను కూడా నెరవేర్చుకున్నాడు. 22 ఏళ్ల అల్కరాజ్ ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు.

వరల్డ్ నం.1 ప్లేయర్ అల్కరాజ్ తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో జకోవిచ్‌పై గెలుపొందాడు. మూడు గంటలకుపైగా ఇద్దరూ పోటీపడ్డారు. ముందుగా జకో‌నే ఆటలో శుభారంభం చేశాడు. అలవోకగానే తొలి సెట్ నెగ్గాడు. తొలి సెట్ కోల్పోయిన తర్వాత అల్కరాజ్ ఇక ఆలస్యం చేయలేదు. దూకుడు పెంచాడు. వరుసగా 2, 3 సెట్లను సులభంగానే గెలిచాడు. కానీ, 4వ సెట్‌లో ఇద్దరు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. ఇద్దరూ సర్వీస్‌లను కాపాడుకోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. కానీ, 12వ గేములో అల్కరాజ్ బ్రేక్ పాయింట్ సాధించడంతో అతని గెలుపు లాంఛనమైంది. జకో 46 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. అల్కరాజ్ 27 తప్పులే చేశాడు. అలాగే, జకో రెండుసార్లే బ్రేక్ పాయింట్ సాధించగా.. అల్కరాజ్ ఐదుసార్లు జకో సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అల్కరాజ్ ఖాతాలో ఇది 7వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇంతకుముందు ఫ్రెంచ్ ఓపెన్(2024, 2025), వింబుల్డన్(2023, 2024), యూఎస్ ఓపెన్(2022,2025) టైటిల్స్ సాధించాడు.

జకో ఆశలపై నీళ్లు

జకోవిచ్ ఇప్పటివరకు 24 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్‌తో కలిసి రికార్డు కలిగి ఉన్నాడు. 2023‌లో యూఎస్ ఓపెన్ నెగ్గడంతో ఈ ఫీట్ సాధించాడు. మరో టైటిల్ గెలిస్తే జకో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో టెన్నిస్‌లోనే కొత్త చరిత్ర సృష్టిస్తాడు. గత మూడేళ్లుగా దీని కోసం జకో ప్రయత్నిస్తుండగా.. మళ్లీ కూడా అతనికి నిరాశ తప్పలేదు. జకోకు టైటిల్‌కు మధ్య ఎప్పుడూ అల్కరాజే అడ్డుగా ఉంటున్నాడు. 2023, 2025 వింబుల్డన్ ఫైనల్‌లో.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో అల్కరాజ్ చేతిలోనే జకో ఓడిపోయాడు. 38 ఏళ్ల జకో కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. ఇప్పటికే అతని రిటైర్మెంట్‌పై ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న జకో తనలో ఇంకా సత్తా ఉందని ఈ టోర్నీతో నిరూపించాడు. ఈ సీజన్‌లోనైనా అతను 25వ గ్రాండ్‌స్లామ్ సాధిస్తాడో లేదో చూడాలి.


Next Story