ఇండియన్ వెల్స్ టైటిల్‌ను స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కైవసం

by Disha Web Desk 13 |
ఇండియన్ వెల్స్ టైటిల్‌ను స్పెయిన్ సంచలనం అల్కరాజ్ కైవసం
X

కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అల్కరాజ్ 6-3, 6-2 తేడాతో రష్యా స్టార్ మెద్వెదేవ్‌పై నెగ్గి విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో విన్నర్లతో చెలరేగిన అల్కరాజ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్‌లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-0తో లీడ్‌లోకి వెళ్లిన అతను ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక, రెండో సెట్‌లో తొలి గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ సాధించిన అల్కరాజ్ మూడో గేమ్‌లోనూ మరోసారి మెద్వెదేవ్‌ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత సర్వీస్‌ను కాపాడుకుని 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన అతను.. కాసేపట్లోనే రెండో సెట్‌ను ముగించాడు.

టైటిల్ నెగ్గిన అల్కరాజ్.. దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ నం.1 ర్యాంక్‌ను తిరిగి సాధించాడు. యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన తర్వాత అల్కరాజ్ తొలిసారిగా అగ్రపీఠం దక్కించుకోగా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరంగా కావడంతో టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయాడు. మహిళల సింగిల్స్ విజేతగా వింబుల్డన్ చాంపియన్, కజకిస్తాన్ క్రీడాకారిణి ఎలెనా రైబాకినా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సబలెంకకు షాకిచ్చిన రైబాకినా 7-6(13-11), 6-4 తేడాతో వరుసగా రెండు సెట్లను గెలుచుకుని టైటిల్ ఎగరేసుకుపోయింది.

Next Story

Most Viewed