శిఖర్ ధావన్‌‌కు బిగ్ రిలీఫ్.. పాటియాలా హౌస్ కోర్టు షాకింగ్ ఉత్తర్వులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-25 12:17:58  IST  )

మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన మాజీ భార్య అయేషా ముఖర్జీపై సాగించిన న్యాయ పోరాటంలో భారీ విజయం సాధించారు.

శిఖర్ ధావన్‌‌కు బిగ్ రిలీఫ్.. పాటియాలా హౌస్ కోర్టు షాకింగ్ ఉత్తర్వులు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌ (Shikhar Dhawan)కు భారీ ఊరట లభించింది. తన మాజీ భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee)పై సాగిస్తున్న న్యాయ పోరాటంలో ఆయన భారీ విజయం సాధించారు. ఆస్ట్రేలియాలోని ఆస్తి సెటిల్‌మెంట్ కింద తీసుకున్న రూ.5.7 కోట్లను శిఖర్ ధావన్‌కు తిరిగి ఇచ్చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అయేషాను ఆదేశించింది. ధావన్ నుంచి ఆ సెటిల్‌మెంట్ పత్రాలపై సంతకాలు తీసుకోవడానికి ఆమె బెదిరింపులు, దోపిడీ (Extortion) మోసపూరిత పద్ధతులు ఉపయోగించిందని కోర్టు నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆ పత్రాలన్నీ చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు దాఖలు చేసిన తేదీ నుంచి చెల్లించి మొత్తంపై 9 శాతం వార్షిక వడ్డీని కూడా కలిపి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అదేవిధంగా గతంలో ఆస్ట్రేలియా (Australia) కోర్టులు ధావన్ ఆస్తుల విషయంలో ఇచ్చిన ఆదేశాలు భారతీయ వివాహ చట్టాలకు విరుద్ధమని, అవి చెల్లవని పాటియాల హౌస్ కోర్టు పేర్కొంది. ధావన్ కెరీర్‌ను నాశనం చేస్తానని, తప్పుడు ఆరోపణలతో పరువు తీస్తానని ఆమె బెదిరించినట్లుగా కోర్టు గుర్తించింది. అందుకే ధావన్ తన సొంత డబ్బుతో కొన్న ఆస్తులను ఆమె పేరు మీద లేదా జాయింట్ పేర్ల మీద రిజిస్టర్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.

కాగా, శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ 2021లో విడిపోగా.. 2023లో వారికి అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. తన కుమారుడు జోరావర్‌ (Zoravar)ను తన నుంచి దూరం చేసినందుకు ధావన్ మానసిక వేదన అనుభవించారని గతంలో కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ధావన్ ఇటీవలే సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నారు.

Next Story