బెంగళూరు తొక్కిసలాట.. ఐపీఎల్ విజయోత్సవాలపై బీసీసీఐ మార్గదర్శకాలు ఇవే!

by Harish |

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.

బెంగళూరు తొక్కిసలాట..  ఐపీఎల్ విజయోత్సవాలపై బీసీసీఐ మార్గదర్శకాలు ఇవే!
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించగా మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇకపై ఐపీఎల్ విజేతగా నిలిచిన ఏ జట్టైనా విజయోత్సవాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి అనుమతిని బీసీసీఐ తప్పనిసరి చేసింది.

తాజాగా ఓ జాతీయ మీడియాతో బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ..ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగుకుండా ఉండేందుకు ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని తెలిపారు. బహిరంగంగా విజయోత్సవాలు జరుపుకోవాలనుకుంటే ఇకపై అధికారిక మార్గదర్శకాలు పాటించాల్సిందేనన్నారు.

ఇటీవల జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో భవిష్యత్తులో విజయోత్సవ వేడుకులకు సంబంధించి భద్రతా ప్రోటోకాల్స్, వాటి అమలుపై ముగ్గురుతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ 30 నాటికి నిర్ణయించిన విధంగా 15 రోజుల్లో నివేదిక సిద్ధంగా ఉంటుందని సైకియా తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా విక్టరీ పరేడ్ కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేయాలని ప్యానెల్ భావిస్తున్నట్టు చెప్పారు. బీసీసీఐ ద్వారా అమలు చేయడం కూడా తప్పనిసరి చేయాలని తెలిపారు.

బీసీసీఐ ప్రతిపాదించిన మార్గదర్శకాలు

- టైటిల్ గెలిచిన తర్వాత 3-4 రోజుల్లో సెలెబ్రేషన్స్‌కు అనుమతించరు.

- ఏదైనా వేడుక నిర్వహించే ముందు బీసీసీఐ అనుమతి తప్పనిసరి.

- బోర్డు నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించరాదు.

- 4-5 స్థాయి సెక్యూరిటీ ప్రొటోకాల్స్ తప్పనిసరి.

- అన్ని వేదికల వద్ద, రవాణా సమయంలో మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ ఉండాలి.

- భద్రత ఏర్పాట్లు ఎయిర్‌పోర్ట్ నుంచి వేదిక వరకు అన్ని కవర్ చేయాలి.

- ఈవెంట్ షెడ్యూల్ అంతటా ఆటగాళ్లకు, సిబ్బందికి రక్షణ కల్పించాలి.

- రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, స్థానిక అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి.

- వేడుకలు చట్టబద్ధంగా,సురక్షితంగా కొనసాగడానికి పౌర, చట్టాన్ని అమలు చేసే సంస్థలు అనుమతి ఇవ్వాలి.


Next Story