టీ20 వరల్డ్ కప్ వేళ భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బోర్డు

by Harish |

టీ20 వరల్డ్ కప్ వేళ భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బోర్డు
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాది ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత బీసీసీఐ ప్లేయర్ల కుటుంబ సభ్యుల విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటంపై ఆంక్షలు విధించింది. 45 రోజుల పర్యటన అయితే గరిష్టంగా రెండు వారాలపాటే కుటుంబసభ్యులు ప్లేయర్లతో ఉండొచ్చని నిర్ణయం తీసుకుంది. కొందరు క్రికెటర్లు కుటుంబాలతో ఉండటం వల్ల జట్టు సమావేశాలకు హాజరు కాలేకపోవడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు ఇతర ప్లేయర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా బీసీసీఐ అదే నిర్ణయానికి కట్టుబడి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో తమ కుటుంబ సభ్యులకు తమ వెంట ఉండటానికి అనుమతి ఇవ్వాలని భారత క్రికెటర్లు బోర్డుకు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. కానీ బీసీసీఐ వారి అభ్యర్థనను తిరస్కరించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ఆటగాళ్లు తమ భార్యలు, ఫియాన్సీలతో ప్రయాణం చేయొచ్చా?.. వారితోనే ఉండొచ్చా? అని టీమ్ మేనేజ్‌మెంట్ బీసీసీఐని సంప్రదించింది. కుటుంబాలు ప్లేయర్లతో ఉండటానికి వీలు లేదు. ’అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వారు కోరుకుంటే కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపాయి. అయితే, ఆటగాళ్ల వ్యక్తిగత చెఫ్‌లకు బోర్డు అనుమతి ఇచ్చిందని, ప్లేయర్లు బస చేసే హోటల్‌కు సమీపంలో వారు ఉండేలా చూసుకోమన్నట్లు తెలుస్తోంది.


Next Story