కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్స్..ఆల్కహాల్, పోర్నోగ్రఫీ, క్రిప్టో కంపెనీలకు నో!

by Phanindra |

కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్స్ ఆహ్వానిస్తోంది. అయితే ఆల్కహాల్, పోర్నోగ్రఫీ, క్రిప్టో కంపెనీలకు నో చెప్పేసింది.

కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ బిడ్స్..ఆల్కహాల్, పోర్నోగ్రఫీ, క్రిప్టో కంపెనీలకు నో!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా లీడ్ స్పాన్సర్‌‌గా డ్రీమ్11 తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రముఖ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న సంస్థలు సెప్టెంబరు 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు తీసుకొచ్చి ఫాంటసీ స్పోర్ట్స్‌ను నిషేధించడంతో డ్రీమ్11 భారీగా నష్టపోయింది. ఈ క్రమంలోనే టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి కూడా తప్పుకుంది. దీంతో ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే టీమిండియా ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అందుకని ఈ విషయంలో తొందరపడకూడదని బీసీసీఐ ఏపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే సెప్టెంబరు 30 నుంచి భారత మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ సమయానికల్లా కొత్త స్పాన్సర్‌ను పట్టేయాలని బీసీసీఐ భావిస్తోంది. 2027 పురుషుల వన్డే వరల్డ్ కప్ వరకైనా ఈ కొత్త స్పాన్సర్‌షిప్ కొనసాగేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రీమ్11 లేదా మరే ఇతర గేమింగ్ కంపెనీలతో బీసీసీఐ ఎలాంటి స్పాన్సర్‌షిప్ డీల్ కొనసాగించలేదని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా చెప్పారు. అందుకే కొత్త స్పాన్సర్ కోసం బిడ్‌లు ఓపెన్ చేసినట్లు వెల్లడించారు.

కంపెనీ కనీస అర్హతలు

బీసీసీఐ నిబంధనల ప్రకారం, టీమిండియా స్పాన్సర్‌షిప్ కోసం బిడ్లు వేసే కంపెనీలకు చివరి మూడు సంవత్సరాల్లో కనీసం రూ.300 కోట్ల టర్నోవర్ ఉండాలి. లేదా మూడేళ్లుగా కంపెనీ నెట్ వర్త్ రూ.300 కోట్లపైన ఉండాలి. బీసీసీఐ నిబంధనలతో కన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ ఉండకూడదు. ఫ్రాడ్, ఆర్థిక నేరాలు వంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. రెండేళ్ల కన్నా ఎక్కువ జైలుశిక్ష పడే ఎలాంటి కేసు ఉండకూడదు. విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ఆర్బీఐ భావించకూడదు.

ఆ వ్యాపారాలతో లింక్ ఉండొద్దు..

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్రిప్టోకరెన్సీ సంబంధిత వ్యాపారాలు, ఆల్కహాల్, టొబాకో, పోర్నోగ్రఫీ లేదా ఇతర అఫెన్సివ్ కంటెంట్, ఇతర సరొగేట్ బ్రాండింగ్‌ చేసే కంపెనీలు ఈ బిడ్స్‌లో పాల్గొనడానికి అర్హులు కాదని బీసీసీఐ స్పష్టంచేసింది.

Next Story