Badminton : సంచలనం సృష్టించిన ఆయుశ్.. వరల్డ్ నం.1 ప్లేయర్‌కు షాక్

by Harish |

Badminton : సంచలనం సృష్టించిన ఆయుశ్.. వరల్డ్ నం.1 ప్లేయర్‌కు షాక్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో ఏకంగా డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నం.1 కున్లావుట్ విటిడ్సార్న్‌కు షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో మెన్స్ సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్న రెండో భారత ప్లేయర్‌గా ఆయుశ్ నిలిచాడు. 1965‌లో దిగ్గజ ఆటగాడు దినేశ్ ఖన్నా ఫైనల్‌కు వెళ్లి గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ఏ ప్లేయర్ మళ్లీ టైటిల్ పోరుకు వెళ్లలేదు. 61 ఏళ్ల మళ్లీ ఇప్పుడు ఆయుశ్ బంగారు పతకానికి చేరువయ్యాడు.

చైనాలో జరుగుతున్న టోర్నీలో మొదటి రౌండ్ నుంచి అదరగొడుతున్న ఆయుశ్ అడ్డొచ్చిన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్నాడు. సెమీస్‌లోనూ తన జోరు చూపించాడు. వరల్డ్ నం.1 విటిడ్సార్న్‌‌‌ను 10-21, 21-19,21-17 తేడాతో మట్టికరిపించాడు. గంటా 15 నిమిషాలపాటు సాగిన పోరులో ఆయుశ్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. తొలి గేము‌లో పెద్దగా పోటీనివ్వలేకపోయాడు. కానీ రెండు గేము నుంచి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. వరల్డ్ నం.1 దూకుడుకు కళ్లెం వేసి లీడ్‌లో కొనసాగాడు. ప్రత్యర్థి పోటీనిచ్చినా ఆయుశ్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. రెండు, మూడు గేముల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే పతకం ఖాయం చేసుకున్న ఆయుశ్ ఫైనల్‌లో గెలిస్తే కొత్త చరిత్ర సృష్టించనున్నాడు.


Next Story