ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

by Gantepaka Srikanth |

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు. మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో ఆయనను అరెస్ట్ చేశారు. సిడ్నీలోని మారుబ్రా (Maroubra) ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో (Random Breath Test) భాగంగా డేవిడ్ వార్నర్ కారును ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం పరిమితి కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీంతో నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు వెంటనే వార్నర్‌ను అరెస్ట్ చేసి మారుబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను వ్యక్తిగత షూరిటీపై విడుదల చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్, వచ్చే నెల మే 7, 2026న సిడ్నీలోని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నేరానికి గానూ ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

పీఎస్ఎల్ మధ్యలో సిడ్నీకి..

ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2026)లో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్, మ్యాచ్‌ల మధ్య కొద్దిరోజుల విరామం దొరకడంతో తన స్వస్థలమైన సిడ్నీకి వెళ్లారు. ఈ సమయంలోనే ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా పేరుగాంచిన వార్నర్, ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story