Australian Open : పెగులా సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్ కీస్ నిష్ర్కమణ

by Harish |   (  Updated:2026-01-26 19:25:06  IST  )

Australian Open : పెగులా సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్ కీస్ నిష్ర్కమణ
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ పోరాటం ముగిసింది. ప్రీక్వార్టర్స్‌లో ఈ అమెరికా క్రీడాకారిణికి మరో అమెరికా అమ్మాయే అయిన పెగులా షాకిచ్చింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో కీస్‌ను 3-6, 4-6 తేడాతో పెగులా మట్టికరిపించింది. గంటా 18 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పెగులాదే స్పష్టమైన ఆధిపత్యం. తొలి సెట్‌లో వరుసగా మూడు గేములు నెగ్గి పట్టు బిగించిన ఆమె అదే జోరులో తొలి సెట్‌ను అలవోకగానే నెగ్గింది. రెండు సెట్‌లో అదే దూకుడు కొనసాగించిన పెగులా 4-1తో లీడ్‌లో నిలిచింది. ఆ తర్వాత కీస్ వరుసగా రెండు గేములు నెగ్గి పోటీలోకి వచ్చేలా కనిపించినా పెగులా ముందు నిలువలేకపోయింది. కీస్ 6 డబుల్ ఫౌల్ట్స్, 28 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఆమె తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిన పెగులా నాలుగు సార్లు బ్రేక్ పాయింట్ సాధించడం ఆమె గెలుపు సులభతరం చేసింది.

స్వైటెక్ హవా

మరో టైటిల్ ఫేవరెట్ క్రీడాకారిణి స్వైటెక్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. నాలుగో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఇంగ్లిస్‌ను 0-6, 3-6 తేడాతో ఓడించింది. 22 విన్నర్లతో విరుచుకపడిన స్వైటెక్ మ్యాచ్‌లో హవా ప్రదర్శించింది. ఐదు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయకేతనం ఎగరవేసింది. ఇంగ్లిస్‌ ఆమెకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. కజకస్థాన్ క్రీడాకారిణి రిబాకినా కూడా ముందంజ వేసి టైటిల్ రేసులోకి వచ్చింది. నాలుగో రౌండ్‌లో రిబాకినా 6-1, 6-3 తేడాతో బెల్జియంకు చెందిన మెర్టెన్స్‌పై ఏకపక్ష విజయం సాధించింది. అయితే, క్వార్టర్స్‌లో ఆమె కఠిన ప్రత్యర్థి స్వైటెక్‌తో తలపడనుంది.

క్వార్టర్స్‌కు సిన్నర్

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జెన్నిక్ సిన్నర్ టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. నాలుగో రౌండ్‌లో సిన్నర్ 6-1, 6-3, 7-6(7-2) తేడాతో ఇటలీకే చెందిన లూసియానో డార్డేరిపై విజయం సాధించాడు. సిన్నర్‌కు మూడో సెట్‌లో మాత్రమే ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైంది. తొలి రెండు సెట్లను అలవోకగానే నెగ్గిన అతను మూడో సెట్‌ను టై బ్రేకర్‌లో గెలిచాడు. దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్‌లో తన ప్రత్యర్థి మెన్సిక్ తప్పుకోవడంతో జకోకు వాకోవర్ ద్వారా ముందంజ వేశాడు.మరో ఇటలీ ప్లేయర్ ముసెట్టి, అమెరికా ఆటగాడు షెల్టన్ కూడా క్వార్టర్స్‌కు చేరుకున్నారు.


Next Story