Australian Open : ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక, రిబకినా

by Harish |   (  Updated:2026-01-29 14:07:56  IST  )

Australian Open : ఫైనల్‌కు దూసుకెళ్లిన సబలెంక, రిబకినా
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనలిస్ట్‌లు ఎవరో తేలిపోయింది. వరల్డ్ నం.1 సబలెంక(బెలారస్), వరల్డ్ నం.5 రిబకినా(కజకస్థాన్) టైటిల్ పోరుకు చేరుకున్నారు. గురువారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో స్విటోలినాను సబలెంక చిత్తు చేయగా.. పెగులాను రిబాకినా మట్టికరిపించింది. శనివారం ఫైనల్ జరగనుంది. ఇప్పటికే 2023, 2024‌లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సబలెంక మూడో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు, ఒక్కసారి కూడా విజేతగా నిలవని రిబకినా కొత్త చాంపియన్‌గా అవతరించాలని చూస్తోంది.

సబలెంక అలవోకగా..

సబలెంక‌కు స్విటోలినా నుంచి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావించారు. ప్రీక్వార్టర్స్‌లో ఆమె కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ఆండ్రీవాను, క్వార్టర్స్‌లో వరల్డ్ నం.3 గాఫ్‌ను ఓడించిన కారణంగా స్విటోలినాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, సబలెంక తన పవర్ ఏంటో చూపించింది. సబలెంక ముందు స్విటోలినా నిలువలేకపోయింది. వరుస సెట్లను 6-2, 6-3 తేడాతో చిత్తు చేసింది. కేవలం గంటా 16 నిమిషాల్లోనే అలవోకగా గెలిచింది. 29 విన్నర్లు బాదిన 4 బ్రేక్ పాయింట్స్ నెగ్గి మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది. స్విటోలినా 17 అనవసర తప్పిదాలు, 3 డబుల్ ఫౌల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకుంది. సబలెంక‌కు ఇది 6వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్.

రిబకినా కాస్త కష్టపడి

సెమీస్‌లో పెగులా(అమెరికా)ను దాటడానికి రిబకినా కాస్త కష్టపడింది. గంటా 40 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో రిబకినా 6-3,7-6(9-7)తో విజయం సాధించింది. తొలి సెట్‌లో వరుసగా మూడు గేములు నెగ్గి ఆమె పట్టు సాధించింది. ఆ తర్వాత కూడా పెగులా పుంజుకునే సమయం ఇవ్వలేదు. కానీ, రెండో సెట్‌లో మాత్రం ఆమెకు పెగులా నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇద్దరూ పరస్పరం సర్వీస్‌లను బ్రేక్ చేసుకున్నారు. ఒక దశలో రిబకినా 4-2తో లీడ్‌లో ఉండగా పెగులా పుంజుకుని రెండో సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లింది. అయితే, రిబకినానే పైచేయి సాధించి విజయం సాధించింది. రిబకినాకు ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్. 2023లో టైటిలో పోరుకు వెళ్లినా అక్కడ సబలెంక చేతులోనే ఓడిపోయింది. ఇప్పుడు సబలెంకకు షాకిస్తుందో లేదో చూడాలి. 2022లో రిబకినా వింబుల్డన్ ఓపెన్ గెలిచింది.

Next Story