- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన సిన్నర్, స్వైటెక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసక్తికరంగా సాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆసక్తికరంగా సాగుతోంది. మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1, డిఫెండింగ్ చాంపియన్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) టైటిల్ కాపాడుకునే దిశగా దూసుకెళ్తున్నాడు. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుని ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో సిన్నర్ 6-3,6-4,6-2 తేడాతో అమెరికా ప్లేయర్ మార్కోస్ గిరాన్‌పై గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నం.1 స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. సిన్నర్ దూకుడు ముందు గిరాన్ పోరాటం సరిపోలేదు. సిన్నర్ 8 ఏస్‌లు, 35 విన్నర్లు బాదాడు. గిరాన్ 2 ఏస్‌లు, 11 విన్నర్లే కొట్టాడు. అయితే, ప్రత్యర్థి పోలిస్తే సిన్నర్ అనవసర తప్పిదాలు ఎక్కువగా చేయడం గమనార్హం. గిరాన్ 23 తప్పులే చేస్తే సిన్నర్ 37 పొరపాట్లు చేశాడు. అయినప్పటికీ కీలక సమయాల్లో పట్టు నిలుపుకోవడంతో అతని విజయం సునాయాసమైంది.
మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నం.2 ఇగా స్వైటెక్(పొలాండ్) జోరు కొనసాగుతున్నది. ఆమె కూడా నాలుగో రౌండ్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకును(గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో స్వైటెక్ 6-1, 6-0 తేడాతో నెగ్గింది. కేవలం గంటా 10 నిమిషాల్లోనే వరుసగా రెండు సెట్లను దక్కించుకుని మ్యాచ్ కైవసం చేసుకుంది. స్వైటెక్ దూకుడు ముందు రాడుకును నిలువలేకపోయింది. రెండు సెట్లలో ఒక్క గేమ్ మాత్రమే నెగ్గడం గమనార్హం. 4 డబుల్ ఫౌల్ట్స్, 22 అనవసర తప్పిదాలతో ఆమె మూల్యం చెల్లించుకుంది. వింబుల్డన్ మాజీ చాంపియన్ రిబకినా కూడా ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో ఆమె 6-3, 6-4 తేడాతో ఉక్రెయిన్ క్రీడాకారిణి యాస్ట్రేమ్స్కాపై విజయం సాధించింది.
ఫ్రిట్జ్, పావోలినిలకు షాక్
టోర్నీలో 7వ రోజు సంచలనం నమోదైంది. వరల్డ్ నం.4 టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)కు అన్‌సీడ్ ప్లేయర్ మోన్ఫిల్స్(ఫ్రాన్స్) షాకిచ్చాడు. మూడో రౌండ్‌లో మోన్ఫిల్స్ 3-6, 7-5, 7-6(7-1), 6-4 తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్ నెగ్గడంతో ఫ్రిట్జ్ మ్యాచ్‌లో శుభారంభమే చేశాడు. కానీ, ఆ తర్వాత బలంగా పుంజుకున్న మోన్ఫిల్స్ గొప్ప పోరాట పటిమ కనబర్చాడు. ఫ్రిట్జ్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడి వరుసగా మూడు సెట్లు నెగ్గడంతో మ్యాచ్ అతని సొంతమైంది. మరోవైపు, వరల్డ్ నం.4 మహిళా క్రీడాకారిణి పావోలినికి కూడా నిరాశే ఎదురైంది. మూడో రౌండ్‌లో ఉక్రెయిన్ స్టార్ ఎలినా స్విటోలినా చేతిలో 6-2, 4-6, 0-6 తేడాతో ఓడపోయింది. తొలి సెట్ నెగ్గిన పావోలిని ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో మ్యాచ్‌ను కోల్పోయి మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది.






