- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Australian Open : రిబకినా ఔట్.. క్వార్టర్స్‌కు సిన్నర్, స్వైటెక్
కజకిస్థాన్ టెన్నిస్ మహిళా క్రీడాకారిణి ఎలెనా రిబకినాకు ఈ సారి కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కల నెరవేరలేదు.

దిశ, స్పోర్ట్స్ : కజకిస్థాన్ టెన్నిస్ మహిళా క్రీడాకారిణి ఎలెనా రిబకినాకు ఈ సారి కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కల నెరవేరలేదు. 2023లో ఫైనల్‌లో బోల్తా పడిన ఈ వింబుల్డన్ మాజీ చాంపియన్ ఈ సారి ప్రీక్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టింది. సోమవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ నాలుగో రౌండ్‌లో రిబకినాను 3-6, 6-1, 3-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ ఓడించింది. గంటా 49 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మూడో సెట్‌లో కీస్ విజయం లాంఛనమైంది. తొలి సెట్‌లో కీస్ నెగ్గి మ్యాచ్‌లో శుభారంభం చేసినా.. రెండో సెట్‌లో రిబకినా బలంగా పుంజుకుంది. దూకుడుగా ఆడి రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే, నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఆమె జోరుకు కీస్ కళ్లెం వేసి క్వార్టర్స్‌కు చేరుకుంది. రిబకినా 6 డబుల్ ఫౌల్ట్స్, 38 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 8వ సీడ్ ఎమ్మా నవారో(అమెరికా), 28వ సీడ్ స్విటోలినా(ఉక్రెయిన్) కూడా ముందడుగు వేశారు. నాలుగో రౌండ్‌లో నవారో 6-4, 5-7, 7-5 తేడాతో 9వ సీడ్ డారియా కసత్కినాపై విజయం సాధించగా.. స్విటోలినా 6-4, 6-1 తేడతో కుడెర్మెటోవాను ఓడించింది.
సిన్నర్ కష్టంగా.. స్వైటెక్ అలవోకగా
మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జెన్నిక్ సిన్నర్(ఇటలీ) క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఈ సారి పోరాటాన్నే నమ్మకున్న అతను నాలుగో రౌండ్‌ను దాటడానికి కాస్త శ్రమించాల్సి వచ్చింది. 13వ సీడ్ రూనె(డెన్మార్క్)పై 6-3, 3-6, 6-3, 6-2 తేడాతో పోరాడి గెలిచాడు. తొలి సెట్ నెగ్గి సిన్నర్ మ్యాచ్‌ను దూకుడుగానే ఆరంభించాడు. కానీ, రెండో సెట్‌లో రూనె పుంజుకుని షాకిచ్చాడు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారినప్పటికీ.. సిన్నర్ వరుసగా 3, 4 సెట్లను దక్కించుకోవడంతో మ్యాచ్ అతని సొంతమైంది. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో ఇగా స్వైటెక్‌కు ఎదురులేకుండా పోయింది. అలవోకగా క్వార్టర్స్‌కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన నాలుగో రౌండ్‌లో ఆమె 6-0, 6-1 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎవా లిస్‌ను చిత్తు చేసింది. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్‌ను స్వైటెక్ గెలుచుకుంది. ఎవా లిస్ ఒక్క గేమ్ మాత్రమే నెగ్గిందంటే స్వైటెక్ హవాను అర్థం చేసుకోవచ్చు. క్వార్టర్స్‌లో ఆమె నవారోను ఎదుర్కోనుంది.
- Tags
- #Australian Open






