ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ జోరు.. నాలుగో రౌండ్‌లో అడుగు

by Harish |

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ జోరు.. నాలుగో రౌండ్‌లో అడుగు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా సాగుతున్న అతను టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించాడు. శనివారం జరిగిన మూడో రౌండ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన బోటిక్ వాన్ డి జూండ్‌స్చుల్‌పై 6-3, 6-4, 7-6(7-4) తేడాతో గెలుపొందాడు. జకో మూడు సెట్లలోనే గెలిచి తన ఆధిపత్యాన్ని చాటాడు. అయితే, ప్రత్యర్థి ప్రతిఘటించడంతో విజయం కోసం కష్టపడ్డాడనే చెప్పాలి. మ్యాచ్ 2 గంటల 44 నిమిషాలపాటు సాగింది. తొలి సెట్‌ను అలవోకగానే నెగ్గగా.. మిగతా రెండు సెట్లలో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. మూడో సెట్‌లో బోటిక్ దూకుడు ప్రదర్శించడంతో జకో 3-1తో వెనుకబడ్డాడు. ఆ తర్వాత పుంజుకుని స్కోరును సమం చేసినా ప్రత్యర్థి కూడా తగ్గకపోవడంతో ఆట రసవత్తరంగా మారింది. కానీ, చివరికి జకో టై బ్రేకర్‌లో నెగ్గి నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు.

మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్ జెన్నిక్ సిన్నర్ కూడా మూడో రౌండ్‌ను కాస్త కష్టంగానే దాటాడు. అమెరికా ప్లేయర్ ఎలియట్ స్పిజిర్రి‌పై 4-6, 6-3, 6-4, 6-4 తేడాతో విజయం సాధించాడు. 3 గంటల 45 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సిన్నర్ పోరాడి గెలిచాడు. మొదట అతను తొలి సెట్ కోల్పోయాడు. కానీ, ఆ తర్వాత ప్రత్యర్థికి చెక్ పెడుతూ వరుసగా 2, 3,4 సెట్లు గెలిచాడు. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా ఏ మాత్రం పట్టుదల కోల్పోకుండా ఆడి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు.

కీస్, స్వైటెక్ హవా

ఉమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ ఏకపక్ష విజయాలతో దూసుకుపోతుంది. మూడో రౌండ్‌లో కీస్ 6-3, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవాపై నెగ్గింది. కేవలం గంటా 15 నిమిషాల్లోనే ఆమె విజయకేతనం ఎగరవేసింది. 6 ఏస్‌లు, 25 విన్నర్లతో విరుచుకపడిన కీస్ 4 బ్రేక్ పాయింట్స్ సాధించింది. మరో టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.2 ఇగా స్వైటెక్ కూడా నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో 6-1, 1-6, 6-1 తేడాతో రష్యాకు చెందిన అన్నా కాలిన్స్కాయను ఓడించింది. రెండో సెట్ కోల్పోవడం మినహా ఆమె మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

Next Story