యాషెస్ 2025లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. వరుసగా మూడు విజయాలతో ట్రోఫీ కైవసం

by Malleboina Mahesh |

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నవంబర్ 21న ప్రారంభమైన ఈ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 'యాషెస్' ట్రోఫీని తన వద్దే నిలబెట్టుకుంది.

యాషెస్ 2025లో ఆస్ట్రేలియా ఆధిపత్యం.. వరుసగా మూడు విజయాలతో ట్రోఫీ కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నవంబర్ 21న ప్రారంభమైన ఈ సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 'యాషెస్' ట్రోఫీని తన వద్దే నిలబెట్టుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ (England)పై 82 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఈ సిరీస్ అంతటా ఆసీస్ ఆటగాళ్లు క్లారిటీ, పట్టుదలతో ఆడి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు. ముఖ్యంగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెర్త్, అడిలైడ్ టెస్టులో అద్భుత సెంచరీలతో సిరీస్ గమనాన్ని మార్చేయగా, మిచెల్ స్టార్క్ వికెట్లతో, అలెక్స్ కేరీ నిలకడైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

అడిలైడ్ టెస్టులో 435 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, 352 పరుగులకు ఆలౌట్ అయింది. జాక్ క్రావ్లీ (85), జేమీ స్మిత్ (60) పోరాడినప్పటికీ, మిచెల్ స్టార్క్, స్కాట్ బోల్యాండ్ వరుస వికెట్లతో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. సిరీస్ ఇప్పటికే ఆసీస్ వశమైనప్పటికీ, మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 'బాక్సింగ్ డే' (Boxing Day) టెస్ట్ డిసెంబర్ 26న మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ కనీసం మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

Next Story