WI VS AUS : వెస్టిండీస్ చిత్తు.. రెండో టెస్టూ కంగారులదే

by Harish |

వెస్టిండీస్‌తో రెండో టెస్టు కూడా ఆస్ట్రేలియా సొంతమైంది.

WI VS AUS : వెస్టిండీస్ చిత్తు.. రెండో టెస్టూ కంగారులదే
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్‌తో రెండో టెస్టు కూడా ఆస్ట్రేలియా సొంతమైంది. ఇప్పటికే తొలి టెస్టు నెగ్గిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసిస్ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్య ఛేదనలో కరేబియన్ జట్టు 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 286 రన్స్ చేసిన ఆసిస్.. విండీస్‌ను 253 స్కోరుకే కట్టడి చేసి 33 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 221/7తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసిస్ మరో 22 పరుగులే చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులు చేసిన కంగారుల జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 33 రన్స్ కలుపుకుని కరేబియన్ జట్టు ముందు 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి సెషన్‌లోనే ఛేదనకు దిగిన విండీస్ పూర్తి చేతులెత్తేసింది. కెప్టెన్ రోస్టన్ చేజ్(34) టాప్ స్కోరర్. ఆ జట్టులో ఎవరూ కనీసం పోరాటం చేయకపోవడంతో విండీస్ 143 పరుగులకే ఆలౌటైంది. ఆసిస్ బౌలర్లు నాథన్ లియోన్, స్టార్క్‌ చెరో మూడు వికెట్లతో విజృంభించగా.. హాజెల్‌వుడ్ కూడా 2 వికెట్లతో సత్తాచాటి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. ఈ విక్టరీతో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్‌‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ నెల 12 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది.


Next Story