యూఏఈ బౌలర్లను ఊచకోతకోసిన వైభవ్.. 32 బంతుల్లోనే సెంచరీ

by Harish |

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

యూఏఈ బౌలర్లను ఊచకోతకోసిన వైభవ్.. 32 బంతుల్లోనే సెంచరీ
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ మ్యాచ్‌లో భారత ‘ఏ’ జట్టు ఏకంగా 148 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఏ’ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి 297 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్.. యూఏఈ బౌలర్లను ఊచకోతకోశాడు. అతను క్రీజులో ఉన్నంత సేపు దోహా స్టేడియం లో సిక్సర్ల మోత మోగించాడు. ఎడాపెడా ఫోర్లు దంచి పరుగుల వరద పారించాడు.ఈ క్రమంలో కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన వైభవ్ మరో 15 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. 32 బంతుల్లో సెంచరీ బాదిన వైభవ్.. భారత్ తరపున టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా పంత్ రికార్డును సమం చేశాడు. మొత్తంగా 42 బంతుల్లో 144 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు, 11 ఫోర్లు ఉండటం విశేషం. వైభవ్ తర్వాత కెప్టెన్ జితేశ్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 83 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వైభవ్, జితేశ్ మెరుపులతో భారత్ ‘ఏ’ జట్టుకు భారీ స్కోరు దక్కింది. అనంతరం ఛేదనలో యూఏఈ 20 ఓవర్లల్లో 7 వికెట్లు కోల్పోయి 149 స్కోరుకే పరిమితమైంది. షోయబ్ ఖాన్(63) మాత్రమే పోరాడగా మిగతా వారు ఆకట్టుకోలేదు. భారత ‘ఏ’ బౌలర్లు గుర్జాన్‌ప్రీత్ 3 వికెట్లు, హర్ష్ దూబె 2 వికెట్లతో సత్తాచాటారు. ఈ విజయంతో టోర్నీలో భారత ‘ఏ’ జట్టు శుభారంభం చేసింది.


Next Story