అర్ష్‌దీప్‌ను అందుకే పక్కనపెట్టాం.. ఎట్టకేలకు మౌనం వీడిన బౌలింగ్ కోచ్

by Harish |

భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ తరుచుగా పక్కనపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అర్ష్‌దీప్‌ను అందుకే పక్కనపెట్టాం.. ఎట్టకేలకు మౌనం వీడిన బౌలింగ్ కోచ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ తరుచుగా పక్కనపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మౌనం వీడాడు. బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోర్కెల్ మాట్లాడుతూ.. వివిధ కాంబినేషన్లను ప్రయత్నించడం వల్లే అర్ష్‌దీప్‌కు అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్-2026 సమయం దగ్గర పడుతుందని, ఒత్తిడిలో ఉన్న పరిస్థితులకు ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో జట్టు తెలుసుకోవాలనుకుంటుందని తెలిపాడు. ప్రపంచకప్ తర్వాత బాధపడే బదులు ఇప్పుడే కాంబినేషన్లను ప్రయత్నించడం ముఖ్యమని చెప్పాడు.

‘అర్ష్‌దీప్ అనుభవజ్ఞుడు. వరల్డ్ క్లాస్ బౌలర్. అతను ఎంత విలువైన ఆటగాడో మాకు తెలుసు. కానీ, ఇతర కాంబినేషన్లను ప్రయత్నించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని అతను అర్థం చేసుకున్నాడు.’అని మోర్కెల్ తెలిపాడు. కష్టపడాలని, అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలని ప్లేయర్లకు చెబుతున్నామని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ దగ్గర పడుతుందని, ఏ అవకాశాన్ని కోల్పోకపోవడం చాలా ముఖ్యమన్నాడు. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత ఇప్పటివరకు అర్ష్‌దీప్ మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాతో తొలి రెండు టీ20లకు కూడా అతన్ని పక్కనపెట్టారు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌ అయిన అర్ష్‌దీప్‌ను తరుచుగా జట్టు నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.దీంతో మూడో మ్యాచ్‌లో చాన్స్ ఇవ్వగా అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Next Story