టీమిండియా స్పాన్సర్‌‌షిప్ హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన బీసీసీఐ.. అన్ని కోట్లు ఖాజానాలో చేరాయా?

by Harish |

టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్ హక్కులను టైర్ కంపెనీ అపోలో టైర్స్ దక్కించుకుంది.

టీమిండియా స్పాన్సర్‌‌షిప్ హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన బీసీసీఐ.. అన్ని కోట్లు ఖాజానాలో చేరాయా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ప్రధాన స్పాన్సర్‌షిప్ హక్కులను టైర్ కంపెనీ అపోలో టైర్స్ దక్కించుకుంది. ఇంతకుముందు టీమిండియా స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు కారణంగా బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త స్పాన్సర్‌ కోసం బోర్డు ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. హక్కుల కోసం పలు కంపెనీలు ఆసక్తి చూపించాయి. మంగళవారం ముంబై హెడ్ క్వార్టర్స్‌లో బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించగా మిగతా కంపెనీలను వెనక్కినెట్టి అపోలో టైర్స్ స్పాన్సర్‌షిప్ హక్కులను పొందింది. దీని ద్వారా బీసీసీఐ, అపోల్ టైర్స్ మధ్య రెండున్నరేళ్లపాటు ఒప్పందం కుదిరింది. 2028 మార్చి వరకు స్పాన్సర్‌గా కొనసాగనుంది. ఒప్పందం ప్రకారం.. అన్ని ఫార్మాట్లలో భారత పురుషుల, మహిళల క్రికెట్ల జట్ల జెర్సీలపై అపోలో టైర్స్ లోగో ఉంటుంది. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో భారత జెర్సీపై తొలిసారిగా కొత్త స్పాన్సర్ లోగో కనిపించనుంది. అంతకుముందు ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ‘ఏ’ జట్టు ఆటగాళ్లు అపోలో టైర్స్ లోగోతో కనిపించనున్నారు.

బీసీసీఐ టార్గెట్ కంటే ఎక్కువే

2023లో డ్రీమ్ 11 రూ.358 కోట్లతో బీసీసీఐతో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త స్పాన్సర్ ద్వారా రూ. 400 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని బోర్డు భావించినట్టు వార్తలు వచ్చాయి. అపోలో టైర్స్ ఎంత మొత్తానికి బిడ్ వేసిన వివరాలను బీసీసీఐ రివీల్ చేయలేదు. అయితే, బోర్డు టార్గెట్ కంటే ఎక్కువే ఆర్జించినట్టు తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అపోలో టైర్స్ రూ.579 కోట్లకు హక్కులను గెలిచింది. కాన్వా(రూ. 544 కోట్లు), జేకే సిమెంట్(రూ.477 కోట్లు) కంపెనీలు కూడా పోటీపడ్డాయి. యూపీకి చెందిన షాంక్ ఎయిర్, దుబాయ్‌కు చెందిన ఓమ్నియాట్ కూడా ఐటీటీ డ్యాక్యుమెంట్స్ కొనుగోలు చేసినప్పటికీ బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. తాజా డీల్ ద్వారా బీసీసీఐ.. డ్రీమ్ 11తో పోలిస్తే రూ.221 కోట్లు ఖజానాలో చేరాయి. 121 దైపాక్షిక మ్యాచ్‌లు, 21 ఐసీసీ మ్యాచ్‌లు ఈ ఒప్పందంలో భాగం. గతంలో డ్రీమ్ 11 దైపాక్షిక మ్యాచ్‌కు రూ.3.17 కోట్లు, వరల్డ్ కప్, ఆసియా కప్ మ్యాచ్‌లకు రూ.1.12 కోట్లు చెల్లించింది. తాజా ఒప్పందం ద్వారా ఒక్కో మ్యాచ్ వాల్యూ కూడా భారీగానే పెరగనుంది. ఒక్క ద్వైపాక్షిక మ్యాచ్‌కు రూ.4.5 కోట్లు చెల్లించనున్నట్టు తెలుస్తోంది.


Next Story