అమన్ డబుల్.. చివరి బంతికి సిక్సర్‌తో 200 పూర్తిచేసిన హైదరాబాదీ

by Phanindra |

చివరి బంతికి సిక్సర్‌తో 200 పూర్తిచేసుకున్నాడు హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావు. బెంగాల్‌పై హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.

అమన్ డబుల్.. చివరి బంతికి సిక్సర్‌తో 200 పూర్తిచేసిన హైదరాబాదీ
X

దిశ, స్పోర్ట్స్: వెస్ట్ బెంగాల్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు (200 నాటౌట్) చెలరేగాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మ్యాచులో డబుల్ సెంచరీ చేయడమేకాదు.. సిక్సర్‌తో ఈ మైలురాయిని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అమెరికాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన అమన్.. ఆడుతున్న మూడో మ్యాచులోనే తొలి లిస్ట్-ఎ శతకాన్ని ద్విశతకంగా మలిచిన తీరు క్రికెట్ పండితులను మెప్పించింది. మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, ముఖేష్ కుమార్, షాబాజ్ అహ్మద్ వంటి బౌలర్లను ఎదుర్కొంటూ 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ హండ్రెడ్ బాదాడీ 21 ఏళ్ల కుర్రాడు.

లిస్ట్-ఎ క్రికెట్లో ఒక హైదరాబాద్ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం. అంతేకాదు విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో నమోదైన 9వ డబుల్ సెంచరీ ఇది. ఈ సీజన్‌లో ఒడిశా ఓపెనర్ స్వస్తిక్ సమాల్ తర్వాత రెండొందలు బాదిన ప్లేయర్ అమన్ రావే. అతని ఊచకోతతో హైదరాబాద్ 352/5 పరుగుల భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో సిరాజ్ (4/48) సహా మిగతా బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది ఈ టోర్నీలో హైదరాబాద్ టీంకు రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం.

Next Story