అదరగొట్టిన అలీసా హేలీ.. మూడో వన్డేలో ఆసీస్-ఎ సునాయాస విజయం

by Phanindra |

భారత్-ఎతో జరిగిన మూడో వన్డేలో ఆసీస్-ఎ ప్లేయర్ అలీసా హేలీ అజేయ శతకంతో చెలరేగింది. దీంతో ఆ టీం సునాయాస విజయం సాధించింది.

అదరగొట్టిన అలీసా హేలీ.. మూడో వన్డేలో ఆసీస్-ఎ సునాయాస విజయం
X

దిశ, స్పోర్ట్స్: భారత్-ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా-ఎ ఓపెనర్ అలీసా హేలీ (137 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగింది. ఆమెతోపాటు తాలియా విల్సన్ (59), రచెల్ ట్రెనమన్ (21 నాటౌట్) రాణించారు. దీంతో ఆ జట్టు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 217 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని కేవలం 27.5 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న ఆసీస్‌కు ఇది కంటితుడుపు విజయమనే చెప్పాలి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. షెఫాలీ వర్మ (52), యాస్తికా భాటియా (42) పట్టుదలగా ఆడారు. నందినీ కశ్యప్ (28), రాధా యాదవ్ (18) చివర్లో పోరాడి, జట్టు స్కోరును 200 దాటించారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత జట్టు 47.4 ఓవర్లలో కేవలం 217 పరుగులకే ఆలౌట్ అయింది.

వరల్డ్ కప్‌లో ఇదే సమస్య..

మ్యాచ్ అనంతరం ఆసీస్ జట్టు వికెట్ కీపర్ అలీసా హేలీ మాట్లాడుతూ.. భారత జట్టు భారీ స్పిన్ బలంతో బరిలో దిగిందని చెప్పింది. వచ్చే వరల్డ్ కప్‌లో కూడా తాము ఇదే సవాల్ ఎదుర్కొంటామని, మిడిల్ ఓవర్లు పూర్తిగా స్పిన్‌తో నిండిపోతాయని అభిప్రాయపడింది. ఈసారి మహిళల వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పిన్‌ ఎదుర్కొనేందుకు ఆసీస్ జట్టు ప్రత్యేకంగా తయారవుతున్నట్లు తెలుస్తోంది.

Next Story