Badminton : వరల్డ్ నం.1 ప్లేయర్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్

by Harish |

Badminton : వరల్డ్ నం.1 ప్లేయర్‌కు షాకిచ్చిన లక్ష్యసేన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ ఘనంగా ఆరంభించాడు. తొలి రౌండ్‌లోనే ఏకంగా వరల్డ్ నం.1 ప్లేయర్ షి యు కి(చైనా)ను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సేన్ 23-21,19-21,21-17 తేడాతో షి యు కిపై విజయం సాధించాడు. తొలి రౌండ్‌లోనే వరల్డ్ నం.1 ప్లేయర్‌ను ఎదుర్కొన్నప్పటికీ సేన్ ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. సేన్ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. చైనా ప్లేయర్ గట్టిపోటీనే ఇచ్చాడు. గంటా 18 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సేన్‌నే వరించింది. దీంతో అతను రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇక ఉమెన్స్ సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఫలితాలే వచ్చాయి. యువ క్రీడాకారిణులు ఉన్నతి హుడా, మాళవిక బాన్సోద్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టారు. ఉన్నతి 12-21, 18-21 తేడాతో థాయిలాండ్‌కు చెందిన చోచువాంగ్ చేతిలో ఓడిపోగా.. బాన్సోద్ 11-21, 6-21తేడాతో చైనా క్రీడాకారిణి వై.ఎఫ్ చెన్ చేతిలో చిత్తయ్యింది. ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్–ట్రీసా జాలీ కూడా నిరాశపరిచింది. తొలి రౌండ్‌లో ఈ భారత జంట 15-21 21-15, 18-21 తేడాతో జపాన్‌కు చెందిన సకురమోటో-హిరోటా చేతిలో పరాజయం పాలైంది. 57 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రీసా జాలీ విజయం కోసం గట్టిగానే శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ విజయం సాధించింది. మలేసియాకు చెందిన హో పాంగ్ రొన్-చెంగ్ సు యిన్ ద్వయంపై 21-17, 21-19తో గెలిచి రెండో రౌండ్‌కు వెళ్లింది.


Next Story