- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో వరల్డ్ నం.1 ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ టైటిల్ వేట మొదలుపెట్టాడు. ఈ సారి ఎలాగైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవాలన్న పంతంతో బరిలోకి దిగిన ఈ స్పెయిన్ ప్లేయర్ టోర్నీలో శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో అల్కరాజ్ 6-3, 7-6(7-2), 6-2 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ వాల్టన్‌పై విజయం సాధించాడు. రెండు గంటలకుపైగా సాగిన ఈ పోరులో అల్కరాజ్ దూకుడు ప్రదర్శించాడు. ఒక్క రెండో సెట్‌లో మినహా అతనికి ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాలేదు. తొలి, మూడు సెట్లను అలవోకగానే నెగ్గాడు. కానీ, రెండో సెట్‌ను మాత్రం కష్టపడి టైబ్రేకర్‌లో గెలవాల్సి వచ్చింది. కానీ, మొత్తంగా అల్కరాజ్‌దే హవా. గ్రౌండ్‌స్ట్రోక్ షాట్స్‌తో విజృంభించాడు. 8 ఏస్‌లు, 38 విన్నర్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. దీంతో ఆస్ట్రేలియా ప్లేయర్ అతని ముందు నిలబడలేక 25 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. వరల్డ్ నం.3 ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో కెనడా ప్లేయర్ గాబ్రియేల్ డియల్లోపై 6-7(1-7), 6-1, 6-1, 6-1 తేడాతో గెలిచాడు. తొలి సెట్ కోల్పోవడంతో ఆరంభంలోనే జ్వెరెవ్‌కు షాక్ తగిలింది. కానీ, ఆ తర్వాతి మూడు సెట్లలోనూ నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
వీనస్ రికార్డు నెలకొల్పి.. నిష్ర్కమించి
2023, 2024లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన వరల్డ్ నం.1 క్రీడాకారిణి సబలెంక టోర్నీని ఘనంగా మొదలుపెట్టింది. తొలి రౌండ్‌లో ఆమె 6-4, 6-1 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన రకోటోమంగాను చిత్తు చేసింది. గంటా 16 నిమిషాల్లోనే సబలెంక వరుసగా రెండు సెట్లు గెలిచింది. మరోవైపు, ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. సెర్బియాకు చెందిన ఓల్గా డానిలోవిచ్ చేతిలో 6-7(5-7), 6-3, 6-4 తేడాతో ఓడిపోయింది. తొలి సెట్ నెగ్గి శుభారంభమే చేసినా మిగతా రెండు సెట్లలో పోరాడినా ఫలితం దక్కలేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 45 ఏళ్ల వయసులో ఈ టోర్నీ బరిలో నిలిచిన ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ఆడుతున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే, ఆమెకు తొలి రౌండ్‌లోనే షాక్ తప్పలేదు.






