- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాడమీ ఉంది.. ప్రతిభ ఉంది.. మద్దతే లేదు.. భారత బ్యాడ్మింటన్‌పై గుత్తా జ్వాల తీవ్ర ఆరోపణలు
భారత బ్యాడ్మింటన్ వ్యవస్థ తీరుపై మాజీ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత బ్యాడ్మింటన్ వ్యవస్థ తీరుపై మాజీ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆటగాళ్ల అభివృద్ధిలో పక్షపాతం, దీర్ఘకాలిక దృష్టి లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆమె ఆరోపించారు. దేశంలో బ్యాడ్మింటన్ క్రీడ కోసం తాను చేసిన సేవలకు కనీస గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన అకాడమీ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా, అధికారులు ఉద్దేశపూర్వకంగానే తనను పక్కన పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. బ్యాడ్మింటన్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని, ఇక్కడ పూర్తిగా గుత్తాధిపత్యం నడుస్తోందని జ్వాల విమర్శించారు. క్రీడకు సంబంధించిన మొత్తం నిర్ణయాలన్నీ ఒకే వ్యక్తి తీసుకుంటున్నారని ఆరోపించారు.
అకాడమీకి దక్కని మద్దతు
నాలుగేళ్లుగా తన అకాడమీ గురించి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 14 కోర్టులతో దేశంలోనే అతిపెద్ద అకాడమీలలో ఒకదానిని తాను స్వయంగా నిర్మించినా, తనకు కనీస మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండర్-19 లేదా సీనియర్ క్యాంపుల బాధ్యతలు అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. అండర్-13 లేదా అండర్-15 ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఆ వయసు నుంచే పిల్లలకు సరైన శిక్షణ అందిస్తే భవిష్యత్తులో వారు దేశానికి గర్వకారణంగా ఎదుగుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ముక్కుసూటిగా మాట్లాడటమే నా నేరమా?
‘ఈ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. నేను ముక్కు సూటిగా మాట్లాడతాను. దీని వల్ల నా అకాడమీలో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ తిరుగుబాటుదారులుగా (రెబెల్స్) తయారవుతారనే తప్పుడు ముద్ర వేస్తున్నారు. నా అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని గుత్తా జ్వాల తెలిపారు. సంబంధిత క్రీడా అధికారుల తీరుపై గుత్తా జ్వాల చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.






