అభిషేక్ విధ్వంసం.. అతను సృష్టించిన రికార్డులు ఇవే

by Harish |

అభిషేక్ విధ్వంసం.. అతను సృష్టించిన రికార్డులు ఇవే
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో తొలి టీ20లో యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మొత్తంగా 35 బంతుల్లో 84 రన్స్ చేశాడు. రింకు సింగ్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 44 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, అభిషేక్ తాజా ఇన్నింగ్స్‌తో టీ20ల్లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్‌ కలిపి 5,000 రన్స్ పూర్తి చేశాడు. టీ20ల్లో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 5 వేల రన్స్‌కు అతను 2,898 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇంతకుముందు ఈ ఘనత విండీస్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్‌(2,942) పేరిట ఉండగా.. తాజాగా అభిషేక్ బద్దలుకొట్టాడు.

అలాగే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌పై ఫాసెస్ట్ ఫిఫ్టీ చేసిన భారత బ్యాటర్ అతనే. అంతేకాకుండా, టీ20ల్లో మరో రికార్డు కూడా నెలకొల్పాడు అభిషేక్. 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అతను 8సార్లు హాఫ్ సెంచరీలు చేశాడు. ఎక్కువసార్లు ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. అతని తర్వాత ఫిల్ సాల్ట్, సూర్యకుమార్, ఎవిన్ లెవిస్ చెరో 7 హాఫ్ సెంచరీలు చేశారు.


Next Story