బుమ్రా వర్క్‌లోడ్.. పరిష్కారం చెప్పిన డివిలియర్స్

by Harish |

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాను పనిభారం కారణంగా మూడు టెస్టులకే పరిమితం చేసిన విషయం తెలిసిందే.

బుమ్రా వర్క్‌లోడ్.. పరిష్కారం చెప్పిన డివిలియర్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను పనిభారం కారణంగా టీమ్ మేనేజ్‌మెంట్ మూడు టెస్టులకే పరిమితం చేసిన విషయం తెలిసిందే. అయితే, బుమ్రాను ఐదు టెస్టులూ ఆడించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించాడు. తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. టీమిండియా నిర్ణయం సరైంది కాదన్నాడు. ‘ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో బుమ్రా టాప్ బౌలర్. అతనికి విశ్రాంతినిచ్చే నిర్ణయం చాలా కఠినమైంది. అతన్ని ఐదు టెస్టులూ ఆడించాలి.’అని తెలిపాడు.

తాను సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఉన్నప్పుడు బౌలర్ డేల్ స్టెయిన్ పనిభారం నిర్వహణలో అనుసరించిన వ్యూహాలను వివరించాడు. ‘అంతగా ప్రాముఖ్యత లేని టీ20, వన్డే సిరీస్‌లకు స్టెయిన్‌కు విశ్రాంతినిచ్చేవాళ్లం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ వంటి ముఖ్యమైన జట్లతో టెస్టు సిరీస్‌ల్లో అతన్ని ఆడించేవాళ్లం. బుమ్రా విషయంలోనూ టీమిండియా ఇదే వ్యూహాన్ని అనుసరించాలి.’అని చెప్పాడు. అయితే, బుమ్రా విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మిస్ మేనేజ్‌మెంట్ కారణమా? లేదా ఇటీవల వెన్ను నొప్పి కారణమా? అనేది తనకు తెలియదన్నాడు. డాక్టర్ బుమ్రా‌ను ఐదు టెస్టులు ఆడొద్దని సూచించి ఉంటే, దాన్ని మనం గౌరవించాలన్నాడు. కాగా, ఇప్పటికే తొలి టెస్టులో బరిలోకి దిగిన బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయాడు. మిగతా నాలుగు టెస్టుల్లో అతను ఏ రెండు మ్యాచ్‌లు ఆడతాడో ఇంకా క్లారిటీ రాలేదు.


Next Story