కీలక ప్రకటన చేసిన ఏబీ డివిలియర్స్.. ఆ జట్టుకు ఆడబోతున్నానని వెల్లడి

by Harish |

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.

కీలక ప్రకటన చేసిన ఏబీ డివిలియర్స్.. ఆ జట్టుకు ఆడబోతున్నానని వెల్లడి
X

దిశ, స్పోర్ట్స్ : ఏబీ డివిలియర్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని డివిలియర్స్ మంగళవారం స్వయంగా వెల్లడించాడు. డివిలియర్స్ తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. భారత్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్న అతి తక్కువ విదేశీ ప్లేయర్లలో డివిలియర్స్ ఒకడు. 40 ఏళ్ల డివిలియర్స్ 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

నాలుగేళ్ల తర్వాత అతను మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్డ్ ప్లేయర్లు, నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లు ఆడే వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్)టోర్నీలో బరిలోకి దిగుతున్నట్టు డివిలియర్స్ ప్రకటించాడు. ‘నాలుగేళ్ల క్రితం అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాను. అప్పుడు నాలో ఇంకా క్రికెట్ ఆడాలనే కోరిక లేకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికా. కాలం గడిచింది. ఇప్పుడు నా కుమారులు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లతో కలిసి నేనూ ఆడతా. మళ్లీ క్రికెట్ ఆడాలని నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో నేను జిమ్, నెట్స్‌కు వెళ్తున్నాను. డబ్ల్యూసీఎల్‌కు సిద్ధంగా ఉన్నా.’ అని వెల్లడించాడు.

ఈ ఏడాది డబ్ల్యూసీఎల్ టోర్నీలో గేమ్ చేంజర్స్ సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు డివిలియర్స్ నాయకత్వం వహించనున్నాడు. జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ వేదికగా టోర్నీ జరగనుంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్ సౌతాఫ్రికా తరపున 114 టెస్టుల, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 20 వేలకు పైగా రన్స్ చేశాడు.


Next Story