తొలి టెస్టులో టీమిండియా చెత్త ఫీల్డింగ్.. ఏకంగా ఆరు క్యాచ్‌లు నేలపాలు

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పట్టు సాధించే అవకాశాలను చేజేతులా కోల్పోయింది.

తొలి టెస్టులో టీమిండియా చెత్త ఫీల్డింగ్.. ఏకంగా ఆరు క్యాచ్‌లు నేలపాలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పట్టు సాధించే అవకాశాలను చేజేతులా కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్ 465 పరుగులు చేయడానికి భారత్ తప్పిదాలు కూడా ప్రధాన కారణం. చెత్త ఫీల్డింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసే చాన్స్‌లను మిస్ చేసుకుంది. భారత ఆటగాళ్లు ఆరు క్యాచ్‌లను నేలపాలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. యశస్వి జైశ్వాల్ ఏకంగా మూడు మ్యాచ్‌లు చేజార్చాడు. జడేజా, పంత్, సాయి సుదర్శన్ కూడా క్యాచ్‌లు విడిచిపెట్టారు. బుమ్రా బౌలింగ్‌లో నాలుగు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్‌లో డక్కెట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను జైశ్వాల్ అందుకోలేకపోయాడు. బుమ్రా వేసిన 7వ ఓవర్‌లోనూ డక్కెట్‌ మరోసారి లైఫ్ లైన్ వచ్చింది. ఈ సారి అతను ఇచ్చిన క్యాచ్‌ను జడేజా మిస్ చేశాడు.

ఇక, శతక వీరుడు ఓలీ పోప్ కూడా 60 పరుగుల వద్దే పెవిలియన్ చేరేవాడు. బుమ్రా వేసిన 31వ ఓవర్‌లో స్లిప్‌లో ఉన్న జైశ్వాల్ క్యాచ్ మిస్ చేయడంతో పోప్ బతికిపోయాడు. హ్యారీ బ్రూక్ మూడుసార్లు అవుట్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా వేసిన బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ అందుకున్నాడు. కానీ, అది నోబాల్ కావడంతో అతను నాటౌట్‌గా తేలాడు. అప్పుడు బ్రూక్ పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో బ్రూక్‌ ఇచ్చిన బంతిని పంత్ పట్టుకోవడంలో విఫలమవడంతో బ్రూక్‌కు మరో లైఫ్ లైన్ వచ్చింది. బుమ్రా బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను జైశ్వాల్ మరోసారి పేలవ ఫీల్డింగ్‌తో నేలపాలు చేశాడు.

ఇక, 72వ ఓవర్‌లో జేమీ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను సాయి సుదర్శన్ సరైన సమయంలో రియాక్ట్ కాలేకపోవడంతో అందుకోలేకపోయాడు. ఇలా మొత్తం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌‌లో ఆరు క్యాచ్‌లు నేలపాలు, ఓ నోబాల్‌తో 7 అవకాశాలను టీమిండియా చేజార్చుకుంది. క్యాచ్ అవుటయ్యే ప్రమాదాల నుంచి బయటపడిన పోప్ ఏకంగా సెంచరీ బాదేశాడు. బ్రూక్ 99 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డక్కెట్(62) హాఫ్ సెంచరీతో మెరిశాడు. స్మిత్ కూడా విలువైన 40 రన్స్ జోడించాడు. ఫలితంగా ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది. ఐదేళ్లలో ఓ టెస్టు ఇన్నింగ్స్‌‌లో జారవిడిచిన అత్యధిక క్యాచ్‌లు ఇవే. భారత్ పేలవ ఫీల్డింగ్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత ఫీల్డింగ్ నిరాశపర్చిందన్నాడు. జైశ్వాల్ మంచి ఫీల్డరేనని, కానీ ఒక్క క్యాచ్ పట్టుకోలేకపోయడన్నాడు.


Next Story