రెండో టెస్టుకు మూడు సవాళ్లు.. విశాఖలో గెలవాలంటే ఇవి అధిగమించాల్సిందే..

by Dishanational5 |
రెండో టెస్టుకు మూడు సవాళ్లు.. విశాఖలో గెలవాలంటే ఇవి అధిగమించాల్సిందే..
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. మూడు రోజులపాటు మ్యాచ్‌పై దాదాపుగా భారత జట్టే ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, నాలుగో రోజు మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. బౌలర్లు ప్రభావం చూపకపోవడం, బ్యాటర్లు విఫలమవడం వెరసి టీమ్ ఇండియాకు ఊహించని ఓటమి. మరో రోజు గడువు ఉన్నప్పటికీ బ్యాటర్లు తొందరపాటు ఆటతో క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయారు. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ముందంజలో ఉంది. ఇక, తొలి టెస్టుతో పోలిస్తే గురువారం నుంచి విశాఖ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టు భారత్‌కు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం భారత్‌ ముందు మూడు సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే రోహిత్ సేన ఇంగ్లాండ్‌కు పోటీనివ్వగలదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




బ్యాటింగ్‌లో పుంజుకోవాలి

అన్నింటికంటే ముఖ్యంగా తొలి టెస్టులో మన బ్యాటర్ల ప్రదర్శన టీమ్ ఇండియాను ఎక్కువగా ఆందోళన కలిగించే అంశం. ఓపెనర్‌గా వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ ఆడిన చివరి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక స్కోరు 39 మాత్రమే. ఇక, తర్వాత చెప్పకోవాల్సింది శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ల గురించి. వీరు కూడా టెస్టుల్లో టెస్టుల్లో దారుణంగా నిరాశపరుస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా గతేడాది మార్చిలో జరిగిన టెస్టులో ఆసిస్‌పై చేసిన సెంచరీ(128) తర్వాత గిల్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆ సెంచరీ తర్వాత గిల్ 11 టెస్టు సిరీస్‌లు ఆడగా, ఒక్కదాంట్లోనూ కనీసం 40 పరుగులు కూడా దాటలేదు. ఇక, 2021 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఒక సెంచరీ, అర్ధసెంచరీతో టెస్టుల్లోకి ఘనంగా అరంగేట్రం చేసిన శ్రేయస్.. ఆ తర్వాత నుంచి పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. శ్రేయస్ గత 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో చేసిన అత్యధిక స్కోరు 35. ఈ గణాంకాలను బట్టి టీమ్ ఇండియా టెస్టు జట్టులో బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, రెండో టెస్టు నుంచైనా రోహిత్, గిల్, శ్రేయస్ ఫామ్ అందుకుని మంచి స్కోర్లు చేయాల్సి ఉంది.




కీలక ఆటగాళ్లు దూరం

రెండో టెస్టుకు కీలక ఆటగాళ్లు దూరం కానున్నారు. సిరీస్ ప్రారంభమవడానికి ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇక, తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ జడేజా సైతం గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరం కానున్నారు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో రాహుల్ 86 పరుగులు చేయగా, జడేజా 87 పరుగులు చేశారు. దీంతో ఫామ్‌లో ఉన్న ఇద్దరు కీలక ప్లేయర్లు జట్టుకు దూరమవుతుండటం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. విరాట్ కూడా లేకపోవడంతో తుది జట్టు కూర్పు కెప్టెన్‌కు పెద్ద తలనొప్పిగా మారిందనేది కాదనలేని వాస్తవం. ఇది టీమ్ ఇండియాకు ప్రతికూలంశమే. కీలక ప్లేయర్లు లేని లోటును ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.




తేలిపోయిన స్పిన్నర్లు

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు పూర్తిగా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం రాణించలేకపోయారు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వికెట్ల కోసం చాలా కష్టపడ్డారు. అశ్విన్ 29 ఓవర్లలో 3 వికెట్లు తీయగా, జడేజా 34ఓవర్లలో 2, 16 ఓవర్లు వేసిన అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు. వారి ఎకానమీ సైతం ఎక్కువగానే ఉంది. అంటే, ప్రత్యర్థి బ్యాటర్లపై స్పిన్నర్లు ఒత్తిడి పెంచలేకపోయారు. వీరి బౌలింగ్‌లో పోప్ అలవోకంగా స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లతో రెచ్చిపోయాడు. అయితే, అదే పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్‌లే ఏడు వికెట్లు తీసి టీమ్ ఇండియాకు కూల్చేశాడు. అంటే, రెండో ఇన్నింగ్స్‌లోనూ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ మన బౌలర్లు రాణించలేకపోయారు. ఈ తప్పిదం నుంచి విశాఖ మ్యాచ్‌లో బయటపడాల్సిందే. లేదంటే, మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story

Most Viewed