తండ్రైన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

by Gantepaka Srikanth |

భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) తండ్రి అయ్యారు. సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి గురువారం (మే 7, 2026) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

తండ్రైన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (SKY) తండ్రి అయ్యారు. సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి గురువారం (మే 7, 2026) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న క్రికెట్ అభిమానులు, తోటి క్రీడాకారులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త అందడంతో సూర్య ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రాయ్‌పూర్‌లో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు సూర్యకుమార్ అందుబాటులో ఉంటారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. తన భార్య ప్రసవ సమయం కావడంతో ఆయన ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణం చేయలేదని సమాచారం.

సూర్యకు అచ్చివచ్చిన 2026..

వ్యక్తిగతంగా సూర్యకుమార్ యాదవ్‌కు 2026 సంవత్సరం ఎంతో గుర్తిండిపోనుంది. కేవలం రెండు నెలల క్రితమే (మార్చి 8, 2026) అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, భారత్‌ను కెప్టెన్‌గా విశ్వవిజేతగా నిలిపారు. ఇప్పుడు తండ్రిగా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మరోవైపు.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆడిన 10 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో ముంబై ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం కాగా, ఇప్పుడు సూర్యకుమార్ కూడా వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌కు దూరమైతే ముంబైకి అది పెద్ద లోటుగానే చెప్పవచ్చు. అయినప్పటికీ, తన ఫేవరెట్ క్రికెటర్ తండ్రి కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. "ప్రపంచకప్ గెలిచాడు.. ఇప్పుడు మహాలక్ష్మి వచ్చింది.. సూర్యకు తిరుగులేదు" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story