ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్ కొత్త ఇంటి నిర్మాణం అందుకేనా..?

by  |
ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్ కొత్త ఇంటి నిర్మాణం అందుకేనా..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆర్మూర్‌లో కొత్తగా నిర్మించుకుంటున్న ఇళ్లు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ కేంద్రంగా రాజకీయ క్షేత్రంలో ఉన్న అర్వింద్ కొత్త ఇంటిని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించి ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అర్వింద్ బీజేపీలో చేరి నూతన రాజకీయ శకాన్ని ప్రారంభించారు. పోటీ చేసిన తొలిసారి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి కొత్త రికార్డులు సృష్టించారు. బీజేపీకి రాష్ర్ట రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన అర్వింద్ రాజకీయాల్లో ఏ కామెంట్ చేసినా ట్రేండ్ సెట్ చేశారు అంటారు కమలం పార్టీ నేతలు.

బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన అర్వింద్ నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా నిర్మించుకున్న కొత్త ఇంటిని ఆర్మూర్ టౌన్‌లో నిర్మించడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్వింద్ భవిష్యత్తులో ఆర్మూర్ నుంచి ఆసెంబ్లీకి పోటి చేస్తారనే ప్రచారం జోరందుకుంది. జిల్లాలో ఎంపీ అర్వింద్‌కు కౌంటర్ ఇవ్వడంలో దూకుడుగా వ్యవహరించే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికు చెక్ పెట్టడానికే అని జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి జోరుగా కార్యకలాపాలు సాగిస్తుండగా.. నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యే అన్నపూర్ణ ఆర్మూర్ నుంచే పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని

పార్టీలో చర్చ నడుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకలపాలు ఎక్కువగా ఆర్మూర్ నుంచే జరుగుతున్నాయి. దీనికి తోడు ఆర్మూర్ పట్టణంలో నిర్మించిన ఇంటి కారణంగా ధర్మపురి అర్వింద్ భవిష్యత్తులో పార్లమెంటుకు పోటీ చేస్తాడా.. ఆర్మూర్ అసెంబ్లీకి పోటీ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు ఆర్మూర్ మధ్యస్థంగా.. అనగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మధ్య ఉండటంతో పార్లమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కొత్త ఇళ్లు కడుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎంపీ అర్వింద్‌కు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన పార్టీ బాధ్యతలు ఉన్న నేపథ్యంలో హైద్రాబాద్ నుంచి రాకపోకలకు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆర్మూర్‌లో అన్ని వసతులు ఉంటాయని భావించి అక్కడ ఇళ్లు కట్టుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు రైతులు అధికంగా ఉన్నది ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల కావడంతో వారికి అందుబాటులో ఉండి స్పైస్ బోర్డు ఎక్స్ టెన్షన్ సెంటర్, దాని ఉపయోగాన్ని రైతుల వద్దకు తీసుకుపోవడానికి అనువుగా ఉంటుందని ఎంపీ భావించి ఉంటారని తెలుస్తోంది. అందువల్లే ఆర్మూర్‌లో ఇళ్లు కడుతున్నారనే మరికొంత మంది అనుకుంటున్నారు.



Next Story

Most Viewed